
నయనానందం.. వినాయక నిమజ్జనం
గద్వాలటౌన్: బోలో గణేష్ మహారాజ్ కీ జై.. గణపతి బప్పా మోరియా.. అంటూ భక్తుల నినాదాలతో గద్వాల పుర వీధులు పులకించాయి. తొమ్మిది రోజులపాటు భక్తుల అశేష పూజలందుకున్న వినాయకుడు తల్లి ఒడికి చేరుకున్నాడు. జిల్లా కేంద్రంలోని ఆయా వీధుల్లో ప్రతిష్టించిన భారీ గణనాథుల విగ్రహాలను గురువారం రాత్రి నిమజ్జనం చేశారు. వివిధ ఆకృతులలో ఏకదంతుడిని తీర్చిదిద్దిన భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానికంగా ఏర్పాటు చేసిన పలు గణేష్ మండపాలలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు వేర్వేరుగా వినాయకుని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలు గణేష్ మండపాల వద్ద అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు. నిమజ్జనోత్సవం యువకులు, పెద్దల నృత్యాలు, భజనలతో కోలాహలంగా సాగింది.