
భక్తిశ్రద్ధలతో అనంత పద్మనాభ స్వామి వ్రతం
మల్దకల్: ఆదిశిలా క్షేత్రమైన స్వయంభూ లక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం అనంత పద్మనాభ స్వామి వ్రతాన్ని వేదపండితులు ఘనంగా నిర్వహించారు. ముందుగా ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు వేదపండితులు రమేషాచారి, మధుసూదనాచారి, రవిచారిల ఆధ్వర్యంలో ప్రవచనాలు వినిపించారు. ఈ వ్రతం తిలకించేందుకు భక్తులు వివిధ గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో హాజరుకాగా.. వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆలయ సిబ్బంది ఏర్పాట్లు చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అదే విధంగా భజన మండలి సభ్యులు కొంకల ప్రసాదాచారి ఆధ్వర్యంలో ప్రత్యేక భజన కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ సత్యచంద్రారెడ్డి, ఆలయ నిర్వాహకులు అరవిందరావు, చంద్రశేఖర్ రావు, నాయకులు చంద్రశేఖర్ రెడ్డి, బాబురావు, వాల్మీకీ పూజారులు తదితరులు పాల్గొన్నారు.
వారోత్సవాలు
జయప్రదం చేయండి
గద్వాల: వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాలను జయప్రదం చేయాలని సీపీఎం రాష్ట్రకమిటీ సభ్యుడు ఆర్ శ్రీరామ్ నాయక్ పిలుపునిచ్చారు. శనివారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలోని నర్మద అధ్యక్షతన జిల్లా కమిటీ సమావేశం నిర్వహించి మాట్లాడారు. పార్టీ ఆధ్వర్యంలోని ఈ నెల 10 నుంచి 17 వరకు జరిగే వారోత్సవాలను జయప్రదం చేయాలన్నారు. వీర తెలంగాణ సాయుధ రైతాంగ పొరాటం నిజాం నవాబుకు వ్యతిరేఖంగా జరిగిందన్నారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని నేడు బీజేపీ రెండు వర్గాల మద్య ఘర్షణగా చిత్రీకరించాలని చూస్తుందని విమర్శించారు. కార్యక్రమంలో సీపిఎం జిల్లా కార్యదర్శి వెంకటస్వామి, జిల్లా కమిటీ సభ్యులు రాజు, రేపల్లె, దేవదాసు, జ్యోతి, వివి నరసింహ, పాల్గొన్నారు.
నేడు బీచుపల్లి ఆలయాల మూసివేత
ఎర్రవల్లి: చంద్రగ్రహణం సందర్భంగా బీచుపల్లి పుణ్యక్షేత్రంలోని కోదండరామస్వామి ఆలయం ద్వారాలను ఆదివారం మధ్యాహ్నం 12.55 గంటల నుంచి మూసివేయనున్నట్లు ఆలయ మేనేజర్ సురేందర్‌రాజు శనివారం ఒక ప్రకనటలో తెలిపారు. గ్రహణం పూర్తి అనంతరం తిరిగి సోమవారం ఉదయం ఆలయ సంప్రోక్షణ తర్వాత ఆలయ ద్వారాలను తెరిచి స్వామివారి దర్శనం కల్పించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
శనేశ్వరాలయానికి
భక్తుల తాకిడి
బిజినేపల్లి: మండలంలోని నందివడ్డెమాన్ జైష్ఠ్యాదేవి సమేత శనేశ్వరాలయానికి శనివారం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. తమ ఏలినాటి శనిదోష నివారణ కోసం శనేశ్వరుడికి తిల తైలాభిషేకాలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకుడు గవ్వమఠం విశ్వనాథశాస్త్రి ఆధ్వర్యంలో అభిషేకాలు, అర్చనలు చేసిన అనంతరం బ్రహ్మసూత్ర శివుడిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో అర్చకులు శాంతికుమార్, ఉమ్మయ్య, కమిటీ సభ్యులు రాజేశ్, ప్రభాకరాచారి, వీరశేఖర్, శ్రీకాంత్‌రెడ్డి పాల్గొన్నారు.
నూతన విద్యా విధానాన్ని విరమించుకోవాలి
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: ప్రభుత్వం నూతన విద్యా విధానాన్ని అమలు చేయాలనే ఆలోచనలను విరమించుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామెర కిరణ్ డిమాండ్ చేశారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఎస్‌ఎఫ్‌ఐ కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం సెకండరీ స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్‌లో ఇంటర్మీడియట్ బోర్డును విలీనంచేసే మార్గదర్శకాల రూపకల్పనకు కసరత్తు చేస్తోందన్నారు. సంస్కరణల పేరుతో 42,000 ప్రభుత్వ పాఠశాలలను 6వేలకు కుదించే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వం నూతన విద్యావిధానం అమలు చేయాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని.. ఈ మేరకు అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. అదే విధంగా పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లు విడుదల చేయాలన్నారు.

భక్తిశ్రద్ధలతో అనంత పద్మనాభ స్వామి వ్రతం