
ఇసుక రవాణాలో ఎలాంటి సమస్యలు రానివ్వొద్దు
● ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలకు సకాలంలో ఇసుక చేర్చాలి
● టీజీఎండీసీ ఎండీ భవేష్ మిశ్రా
రాజోళి: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం నేపథ్యంలో ఇసుక రవాణాలో ఎలాంటి సమస్య రానివ్వకుండా తగు చర్యలు చేపట్టాలని టీజీఎండీసీ ఎండీ భవేష్ మిశ్రా ఆదేశించారు. రాజోళి మండలం తుమ్మిళ్ల గ్రామంలో ఇసుక తవ్వకాలకు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో బుధవారం ఆయన పర్యటించారు. ఈమేరకు తుంగభద్ర నదిలో ఫ్లెడ్జింగ్ సిస్టమ్ ద్వారా తీస్తున్న ఇసుకను ఆయన పరిశీలించారు. ఇసుకను లబ్ధిదారులకు ఎలా పంపుతారంటూ ఆరా తీశారు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణాల కోసం ఆన్‌లైన్ ద్వారా బుక్ చేసుకున్న వారికి ఇసుక సకాలంలో చేరుకోవాలని, లేదంటే ఇంటి నిర్మాణంలో జాప్యం జరుగుతుందని అన్నారు. అలాంటి సమస్యలు తలెత్తకుండా చూడాలని సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్లకు సూచించారు. కాగా జిల్లాలోని పలు చోట్లకు ఇసుకను రవాణా చేస్తున్న క్రమంలో వారికి ఇసుకను చేర్చేందుకు ఉన్న మార్గాల ద్వారా ఇబ్బందులు వస్తున్నాయని కాంట్రాక్టర్లు తెలిపారు. తుమ్మిళ్లలోని ఇసుక రీచ్‌కు, రాజోళి మండలం పడమటి గార్లపాడు గ్రామం దగ్గర ఉండటంతో పాటు, ఆ వైపున ఉన్న గ్రామాలకు అదే మార్గంలో వెళ్తేనే సకాలంలో చేరుకోగలమని, లేదంటే చుట్టూ తిరిగి ఇతర మార్గాల ద్వారా వెళ్లాలంటే సమయం వృథా కావడంతో పాటు, లబ్ధిదారులకు ఇసుక అందించడంలో ఆలస్యం అవుతుందని ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ఈ సమస్యపై కలెక్టర్‌తో మాట్లాడి పరిష్కరిస్తామన్నారు. ప్రస్తుతం ఇసుక తవ్వకాలు ఎందుకు నిలిచాయని అడగగా.. నదిలో వరద ఎక్కువగా ఉన్నందున ఇసుక తీయడం కుదరడం లేదని, నీటి ఉధృతి తగ్గగానే ఇసుకను తీస్తామని, ప్రస్తుతం ఉన్న ఇసుకతో ఇందిరమ్మ ఇళ్లకు నిలపకుండా అందిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఏడీ వెంకటరమణ, ప్రసాద్‌బాబు,తహసీల్దార్ పి.రామ్మోహన్,సీఐ టాటాబాబు తదిదరులు పాల్గొన్నారు.