
ఇందిరమ్మ ఇళ్లను త్వరగా పూర్తి చేయాలి
ఇటిక్యాల/ఎర్రవల్లి: ఇందిరమ్మ ఇళ్లను త్వరగా పూర్తిచేసేలా కృషి చేయాలని కలెక్టర్ అధికారులకు ఆదేశించారు. బుధవారం ఇటిక్యాల మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను కలెక్టర్ తనిఖీ చేశారు. ఇంటి నిర్మాణ పనుల్లో నాణ్యతను క్షేత్రస్ధాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నిబంధనలకు అనుగుణంగా ఇళ్ల నిర్మాణాలు జరిగేలా లబ్ధిదారులకు అవసరమైన సలహాలు, సూచనలు అందించాలని, ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం ఉచితంగా ఇసుక తీసుకెళ్లేందుకు కూలీ, రవాణా చార్జీలు మాత్రమే లబ్ధిదారులు చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. వివిధ దశలను అనుసరిస్తూ డబ్బును వెంటనే ఖాతాలో ప్రభుత్వం జమ చేస్తుందన్నారు. అనంతరం మండల కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్ధుల భవిష్యత్ కోసం నాణ్యమైన విద్య అందించడంలో ఎలాంటి రాజీ ఉండకూడదని, వసతి, భోజనం, శుభ్రత, భద్రతపై అధికారులు నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని సూచించారు. పదో తరగతిలో వందశాతం ఉతీర్ణత సాధించడానికి కృషిచేయాలని అన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ వీర భద్రప్ప, ఎంపీడీఓ అబ్దుల్ సయ్యాద్ ఖాన్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు సురేష్, పంచాయతీ కార్యదర్శి రమేష్ పాల్గొన్నారు.
భూ భారతి దరఖాస్తులను పరిష్కరించాలి
భూ భారతి దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఎర్రవల్లి తహసీల్దార్ కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి భూ భారతి రిజిస్ట్రేషన్ ప్రక్రియను పరిశీలించారు. భూ భారతి పోర్టల్‌లో డేటా ఎంట్రీ పనులను వేగంగా, ఖచ్చితంగా పూర్తిచేయాలని, నిబంధనల మేరకు సక్సేషన్, పెండింగ్ మ్యుటేషన్, మిస్సింగ్ సర్వే, పీవోపీ, డీఎస్ పెండింగ్ అన్ని దరఖాస్తులు పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. సాదా బైనామా అప్లికేషన్లనీ ముందుగా సిద్ధం చేసి ప్రభుత్వ ఆదేశాలు వచ్చిన వెంటనే వాటిని పూర్తిచేయవచ్చునని అన్నారు. దరఖాస్తుదారుని ఆధార్‌కార్డ్, పట్టాదారు పాసుపుస్తకం, సాక్షుల ఆధార్‌కార్డ్‌లు సక్రమంగా పరిశీలించాలన్నారు. ప్రతి రిజిస్ట్రేషన్‌లో బయోమెట్రిక్ సరిగా, తప్పులేకుండా చేయాలన్నా రు. రెవెన్యూ కార్యాయాల్లో రేషన్‌కార్డుల వివరాలు, మీసేవా ద్వారా సర్టిఫికేట్లు, ఆఫీస్ రికార్డులు, ఇతర అన్ని డాక్యుమెంట్లను సక్రమంగా స్పష్టంగా, ఆప్‌టుడేట్ గా ఉంచాలన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సేవలు సమయానికి, పారదర్శకంగా అందించేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ నరేష్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.