ప్రత్యేక అధికారులకు వార్నింగ్‌ | - | Sakshi
Sakshi News home page

ప్రత్యేక అధికారులకు వార్నింగ్‌

Jan 31 2024 12:16 AM | Updated on Jan 31 2024 12:16 AM

- - Sakshi

గద్వాల రూరల్‌: స్థానిక సంస్థలలో సర్పంచ్‌ల పదవీకాలం ముగియడంతో ఫిబ్రవరి 1 (గురువారం) నుంచి ప్రత్యేకాధికారుల పాలన మొదలవుతుంది. స్థానిక సంస్థలకు తిరిగి ఎన్నికలు నిర్వహించే వరకు గ్రామాల్లో అభివృద్ధితోపాటు ఇతర పనులన్నీ కూడా వీరి పర్యవేక్షణలోనే జరుగుతాయి. ఈ నేపథ్యంలో గద్వాల నియోజకవర్గంలోని ఐదు మండలాల ఎంపీడీఓలు, పంచాయతీ కార్యదర్శులను జెడ్పీ చైర్‌పర్సన్‌ సరిత మంగళవారం తన ఇంటికి పిలిపించుకుని సమీక్షించారు. గ్రామాల్లో చేపట్టే రోజువారి పారిశుద్ధ్య పనులు, నిధుల మంజూరు తదితర అంశాలపై చర్చించారు. ఈ క్రమంలోనే.. మేం చెప్పినట్లు వినాలి. పదవీకాలం పూర్తయిన సర్పంచ్‌ల మాటలు వినొద్దు.. ఒకవేళ మా మాట వినకపోతే మీ స్థానంలో మా మాట వినే అధికారులు వస్తారు.. మీరే డిసైడ్‌ చేసుకోండి.. ఎవరికై నా మా మాట వినడం ఇష్టం లేకపోతే మీరే స్వచ్ఛందంగా తప్పుకోండి మీకే మంచిది.. అంటూ ఎంపీడీఓలు, పంచాయతీ కార్యదర్శులకు వార్నింగ్‌ ఇచ్చినట్లు సమాచారం.

ఆదినుంచి ఆధిపత్య పోరే..

రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం ఉంటే గద్వాలలో మాత్రం అందుకు భిన్నంగా బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే అధికార పార్టీకి చెందిన జెడ్పీ చైర్‌పర్సన్‌ సరిత ప్రస్తుత ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ఎన్నికల ముందు వరకు ఒకే పార్టీలో ఉంటూ ఉప్పు నిప్పు మాదిరి ఒకరిపై మరొకరు ఆధిపత్యాన్ని ప్రదర్శించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత జెడ్పీ చైర్‌పర్సన్‌ కాంగ్రెస్‌లో చేరి.. ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. దీంతో గత ఐదేళ్లపాటు సాగిన ఆధిపత్య పోరు మరో ఐదేళ్లు కొనసాగబోతుందనేది ఇటీవల చోటుచేసుకుంటున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.

ఉద్యోగం కత్తిమీద సామే..

గద్వాలలో ఉద్యోగం చేయాలంటే కత్తిమీది సాములా ఉందని ఓ మండలానికి చెందిన అధికారి చెప్పడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతుంది. ఎమ్మెల్యేగా ఎన్నికై న నేత ప్రతిపక్ష పార్టీలో ఉండగా.. ఓడిన అభ్యర్థి అధికార పార్టీలో ఉన్నారు. ఇప్పుడు అధికారులు ఎవరి మాట వినకున్నా ఇబ్బందులు పడాల్సిందే. పైగా గురువారం నుంచి స్థానిక సంస్థలలో ప్రత్యేకాధికారుల పాలన మొదలవుతుంది. దీంతో ఇటు ప్రజాప్రతినిధి మాట వినాలా..? లేకపోతే అధికార పార్టీలో ఉన్న నేతల మాట వినాలా..? మా పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడ్డట్లయ్యిందని వాపోయారు. అలాగే ఇటీవల జరిగిన జెడ్పీ సర్వసభ్య సమావేశంలో అధికారులతో మేం ఫ్రెండ్లీగా ఉంటాం.. ఎలాంటి ఇబ్బందులకు గురిచేయం మాకు పూర్తి మద్దతు పలికారు. అని చెప్పి ఐదురోజులు గడవక ముందే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.

నిరూపిస్తే రాజీనామా చేస్తా: జెడ్పీచైర్‌పర్సన్‌

ఫిబ్రవరి నుంచి గ్రామాల్లో ప్రత్యేకాధికారుల పాలన మొదలవుతుందని, ఈ నేపథ్యంలో గ్రామాల్లో రోజువారి పారిశుద్ధ్య నిర్వహణ, ఇతర పనులపై ఎంపీడీఓలు, గ్రామ కార్యదర్శులతో సమీక్షించానని జెడ్పీ చైర్‌పర్సన్‌ సరిత చెప్పారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా రోజువారి పారిశుద్ధ్య నిర్వహణ పనులు కచ్చితంగా నిర్వహించాలని అధికారులకు చెప్పడం జరిగిందన్నారు. మీకు అభ్యంతరం లేకపోతే ఎక్కడైన గ్రామాల్లో మెయింటెన్స్‌ పనులకు ఇబ్బందులు అనిపిస్తే మా మనిషిని అటాచ్‌ చేస్తాం. వారి ద్వారా పనులు చేయించుకోండి అని సూచించామని, ఎవరికీ వార్నింగ్‌ ఇవ్వలేదన్నారు. అవన్నీ అసత్య ఆరోపణలు అని.. నేను అలా మాట్లాడినట్లు ఏ ఒక్క అధికారైన చెబితే తక్షణమే పదవికి రాజీనామా చేస్తానని పేర్కొన్నారు.

‘రేపటి నుంచి గ్రామాల్లో ప్రత్యేక అధికారుల పాలన అమలవుతుంది.. పైన మా ప్రభుత్వం ఉంది.. ఇక మీదట మేం చెప్పినట్లే వినాలి.. లేదంటే మీ స్థానంలో మా మాట వినే వాళ్లు వస్తారు.. ఎవరికై నా నచ్చకపోతే స్వచ్ఛందంగా తప్పుకోండి మీకే మంచిది.. మీరే డిసైడ్‌ చేసుకోండి.. తరువాత ఇబ్బంది పడితే లాభం లేదు.’ అంటూ జెడ్పీ చైర్‌పర్సన్‌ సరిత అధికారులను తన ఇంటికి పిలిచి ఇచ్చిన వార్నింగ్‌ ఇది. సదరు నేత ఇచ్చిన వార్నింగ్‌తో ఖంగుతినడం అధికారుల వంతైంది. ఇప్పుడు ఇదే విషయం అధికార వర్గాల్లో చర్చనీయాంశమవగా.. స్థానికంగా హాట్‌టాపిక్‌గా మారింది.

చెప్పినట్లు వింటే ఉంటారు.. లేదంటే పోతారు

ఎవరికై నా నచ్చకపోతే

స్వచ్ఛందంగా తప్పుకోండి

అధికారులను ఇంటికి పిలిచిహెచ్చరించిన జెడ్పీ చైర్‌పర్సన్‌ సరిత

స్థానిక సంస్థలలో ప్రత్యేకాధికారుల పాలన నేపథ్యంలో చర్చ

అధికార వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారిన సంఘటన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement