గద్వాల: మాజీ ఎమ్మెల్యే ఉప్పల గోపాల్‌రెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి ఎనలేని కృషి చేశారని సీనియర్ సిటీజన్ సంఘం నాయకులు నాయకులు వైండింగ్ రాములు, మోహన్‌రావు, భీంసేన్‌రావు అన్నారు. మంగళవారం గోపాల్‌రెడ్డి 33వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో కౌన్సిలర్ పులిపాటి వెంకటేష్, రమేష్‌గౌడ్, అచ్చన్నగౌడ్, అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.
భక్తిశ్రద్ధలతో అశ్వవాహనసేవ
అడ్డాకుల: మండలంలోని కందూర్‌లో స్వయంభూగా వెలసిన శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయంలో సోమవారం అర్ధరాత్రి తర్వాత స్వామివారికి అశ్వవాహనసేవ వైభవంగా నిర్వహించారు. ముందుగా ఆలయం ముందున్న చిన్న తేరును పూజారులు శుద్ధి చేశారు. అనంతరం స్వామివారి ఉత్సవ విగ్రహాలను పూజారులు తీసుకువచ్చి చిన్న తేరుపై ఉన్న అశ్వవాహనంపై అలంకరించారు. ఈ సందర్భంగా తేరు ముందు పండితులు హోమం నిర్వహించారు. భక్తులంతా కలిసి తేరును జయజయధ్వానాల మధ్య కొద్ది దూరం వరకు తీసుకెళ్లి అశ్వవాహనసేవ ముగించారు. మంగళవారం ఉదయం చంద్రగ్రహణం ఉండటంతో ఆలయాన్ని మూసి ఉంచారు. రాత్రి 7 గంటల తర్వాత ఆలయాన్ని సంప్రోక్షణ చేశారు. తర్వాత స్వామివారికి ఏకాదశ రుద్రాభిషేకం, రుద్రహోమం, బలిహరణ తదితర పూజలు జరిపించారు. గ్రామంలో ఉన్న స్వామివారి వెండి ముఖం, నాగపడగలను రాత్రి పల్లకీలో ఊరేగింపుగా ఆలయానికి తీసుకువచ్చారు. అనంతరం ప్రధాన ఆలయంలో శివలింగానికి వెండి ముఖం, నాగపడగను అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు.


