వనపర్తి: దక్షిణ తెలంగాణలో అత్యంత ఆదాయం సమకూరే పెబ్బేరు సంతపై అధికార పాలకవర్గం ఊదాసీనత ప్రదర్శిస్తోంది. ఏటా రూ.కోట్ల ఆదాయం పక్కదారి పడుతున్నా పట్టించుకోకపోవడం శోచనీయం. ఇప్పటి వరకు పెబ్బేరు పురపాలికకు చెందాల్సిన సుమారు రూ.12 కోట్ల ఆదాయం ప్రైవేట్ వ్యక్తుల జేబుల్లోకి చేరుతున్నాయన్న చర్చ స్థానికంగా వినిపిస్తోంది. చివరగా నాలుగేళ్ల కిందట సంత వేలం నిర్వహించి కాంట్రాక్టర్లకు అప్పగించగా.. వారు వారాంతపు సంతలో పశువులు, కోళ్లు, ఇతర వస్తువుల విక్రయదారుల నుంచి తైబజార్ వసూలు చేసి పురపాలికకు చెల్లించేవారు. ప్రస్తుతం టెండర్ల నిర్వహణ లేకపోవడంతో భారీగా ఆదాయం కోల్పోతోంది. అలాగని సంతలో తైబజార్ వసూళ్ల పర్వం ఆగలేదు. అటు చిరు వ్యాపారులకు తైబజార్ భారం తప్పక.. ఇటు మున్సిపాలిటీకి ఆదాయం సమకూరకపోగా.. మధ్యలోని కొందరు ప్రైవేట్ వ్యక్తులు సంత ఆదాయాన్ని దండుకుంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో అర్చకులకు సంతస్థలంపై హక్కు కల్పిస్తూ కోర్టు తీర్పు వెలువడటంతో మున్సిపాలిటీ టెండర్ నిర్వహణకు వెనకడుగు వేసింది. ఈ అవకాశం కొందరికి కాసుల పంటగా మారిందని చెప్పవచ్చు.
ఇదీ వివాదం..
స్థానిక వేణుగోపాలస్వామి ఆలయానికి చెందిన 30.19 ఎకరాల భూమి ఉండగా.. అందులోని 16 ఎకరాల్లో పెబ్బేరు గ్రామపంచాయతీగా ఉన్నప్పటి నుంచి కొనేళ్లుగా ప్రతి శనివారం వారాంతపు సంత నిర్వహిస్తున్నారు. సంతపై వచ్చే ఆదాయాన్ని పాలకవర్గం తీర్మానం మేరకు పట్టణాభివృద్ధికి వెచ్చించేవారు. ఈ స్థలం తమదంటూ ఆలయ అర్చకులు, దేవాదాయశాఖ మధ్యలో చాలాకాలం కోర్టులో కేసు నడుస్తుండేది. గత ప్రభుత్వ హయాంలో సంత నిర్వహించే స్థలాన్ని రెవెన్యూశాఖకు అప్పగిస్తే.. అంతే స్థలాన్ని మరోచోట చూపించేలా అర్చకులు ఒప్పందం కుదుర్చుకొని హక్కులు మార్చుకున్నారు. కాగా సంత స్థలం వదులుకున్న అర్చక కుటుంబాలకు రెవెన్యూశాఖ భూమి చూపించకపోవడంతో వారు కోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు సంత స్థలంలో క్రయ విక్రయాలు జరగకుండా, టెండర్లు నిర్వహించకుండా నిషేధం విఽధించడంతో వివాదం మొదలైంది. కానీ నేటికీ సంత కొనసాగిస్తూ వ్యాపారులు, గొర్రెలు, మేకలు, పశువుల కొనుగోలు చేసిన రైతుల నుంచి డబ్బులు వసూలు ఆగకపోవడం గమనార్హం. పట్టణంలోని వివిధ దుకాణాలకు వచ్చే ఆటోలు, ట్రాన్స్‌పోర్టు లారీలు, డీసీఎం వద్ద కూడా డబ్బులు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. సంతపై వచ్చే ఆదాయాన్ని మున్సిపాలిటీలో జమ చేయకపోయినా.. బ్యాంకులో జాయింట్ ఖాతా తెరిచి అందులో జమ చేస్తున్నట్లు సంత నిర్వాహకులు పేర్కొంటున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు అఽధికారులకు ఇప్పటి వరకు అందజేయకపోవడం గమనార్హం.
వారానికి రూ.6.36 లక్షలు..
గతంలో టెండర్లు నిర్వహించగా వారానికి రూ.6.36 లక్షల చొప్పున మున్సిపాలిటీకి చెల్లించాలని నిర్ణయించారు. పెబ్బేరు మున్సిపాలిటీకి సమకూరే ఆదాయంలో వారాంతపు సంత, తైజజారే అత్యధికం. పశువులు ఒక్కింటికి రూ.100, గొర్రెలు, మేకలకు రూ.10 నుంచి రూ.50 వరకు, తైబజారు రూ.10 నుంచి రూ.50 దాకా వసూలు చేస్తున్నారు. తైబజార్ వసూలు చేసేందుకు పశువులు, మేకలు, గొర్రెలకు విడివిడిగా కాంట్రాక్టర్లు ఉన్నారు.
పెబ్బేరులో కొనసాగని సంత వేలం
రూ.కోట్ల ఆదాయం కోల్పోతున్న పురపాలిక
కోర్టు వివాదంతో నిలిచిన వైనం
పాలకవర్గం ఉదాసీనత..
ప్రైవేట్ వ్యక్తులదే జోరు


