గట్టులో భూ మాయ | - | Sakshi
Sakshi News home page

గట్టులో భూ మాయ

Mar 4 2026 7:49 AM | Updated on Mar 4 2026 7:49 AM

గట్టు: మండల కేంద్రమైన గట్టులో భూ మాయ వ్యవహారం వెలుగు చూసింది. విషయం తెలుసుకున్న అసలు భూ యజమాని మంగళవారం మండల రెవెన్యూ కార్యాలయానికి చేరుకొని తహసీల్దార్‌తో పాటు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలి వివరాల ప్రకారం.. మండలంలోని రాయాపురం గ్రామానికి చెందిన తిమ్మప్పకు గ్రామ శివారులోని సర్వే నంబర్‌ 81/8లో 31 గుంటల వ్యవసాయ భూమి ఉంది. అయితే తిమ్మప్ప సుమారు 15 ఏళ్ల క్రితం చనిపోవడంతో అతడి భార్య సువర్ణ బతుకుదెరువు నిమిత్తం జడ్చర్లకు వెళ్లింది. ఈ క్రమంలోనే తారాపురం గ్రామానికి చెందిన తిమ్మప్ప అనే వ్యక్తి ఆధార్‌తో సదరు భూమికి లింకు చేశారు. కొన్నాళ్లకు తిమ్మప్ప చనిపోగా.. 2024లో ఆ భూమిని అతడి కుమారుడు సంకటి ముణెప్పకు వారసత్వంగా బదిలీ చేశారు. ఆ తర్వాత గట్టులో ఆన్‌లైన్‌ సర్వీస్‌ సెంటర్‌ నిర్వహించే లక్ష్మణ్‌ అనే వ్యక్తి సంకటి ముణెప్పకు రూ. 50వేలు చెల్లించి.. గత ఫిబ్రవరిలో ఆ భూమిని తాను కొనుగోలు చేసినట్లు పత్రాలు సృష్టించి తన పేరున తహసీల్దార్‌ కార్యాలయంలో రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నాడు. ఈ వ్యవహారంలో ఆన్‌లైన్‌ సెంటర్‌ నిర్వాహకుడు లక్ష్మణ్‌తో పాటు తారాపురం గ్రామ సర్పంచ్‌ భర్త కీలకంగా వ్యవహరించినట్లు బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు.

అధికారులతో వాగ్వాదం..

అక్రమ భూ బదలాయింపు వ్యవహారం బయట పడటంతో బాధిత కుటుంబ సభ్యులు గ్రామస్తులను వెంటపెట్టుకుని తహసీల్దార్‌ కార్యాలయానికి చేరుకున్నారు. తన భర్త పేరున ఉన్న భూమిని తనకు తెలియకుండా వేరే వ్యక్తుల పేరుపై ఎలా రిజిస్ట్రేషన్‌ చేస్తారంటూ.. బాధితురాలు సువర్ణ అధికారులతో వాగ్వాదానికి దిగారు. తమ భూమిని అక్రమంగా తన పేరుపైకి మార్చుకున్న లక్ష్మణ్‌పై చర్యలు తీసుకోవాలని లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. అక్కడి నుంచి పోలీస్‌స్టేషన్‌కు చేరుకొని ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న లక్ష్మణ్‌ తరఫు వారు తహసీల్దార్‌ కార్యాలయానికి చేరుకోవడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

● ఈ వ్యవహారంపై తహసీల్దార్‌ విజయ్‌కుమార్‌ను వివరణ కోరగా.. అసలైన వారసులం తామే అని చె బుతున్న రాయాపురం సువర్ణ ఇప్పటి వరకు సరైన ఆధారాలను సమర్పించలేదని తెలిపారు. ఈ విషయంపై తాము పూర్తి విచారణ చేస్తామని.. మోసం జరిగినట్లు తేలితే సదరు వ్యక్తులపై క్రిమనల్‌ కేసులు నమోదు చేస్తామన్నారు. సరైన పత్రాలు ఉంటే ఆర్డీఓ అప్పీలు ద్వారా భూ బదలాయింపును రద్దు చేసుకునే అవకాశం ఉందన్నారు.

ఒకరి భూమికి మరొకరి ఆధార్‌ లింకు

నకిలీ పత్రాలతో

భూ బదలాయింపు.. ఆపై విక్రయం!

అసలు భూ యజమానికి తెలియడంతో అధికారులకు ఫిర్యాదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement