కాళేశ్వరం : కాళేశ్వరం దేవస్థానం కూల్చివేత పనులు కొన్ని రోజులుగా జరుగుతున్న విషయం తెలిసిందే. డ్రాయింగ్, డిజైన్ల ఆలస్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో రెండ్రోజుల్లో మట్టి పూడికతీత పనులు ప్రారంభం కానున్నాయని ఓ ఆర్కిటెక్చర్ పేర్కొన్నారు. డ్రాయింగ్‌లు ఇప్పటికే తమ సంస్థ నుంచి దేవాదాయ, ఆర్‌అండ్‌బీ శాఖకు అందజేసినట్లు తెలిపారు. పూర్తిస్థాయి విషయం మాత్రం తెలియాల్సి ఉంది.
మేడిగడ్డకు 54,820 క్యూసెక్కుల ప్రవాహం
కాళేశ్వరం : మహదేవపూర్‌లోని కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బరాజ్‌కు ఎగువన మహారాష్ట్రలోని గడ్చిరోలి నుంచి ప్రాణహిత నది ద్వారా వరద ప్రవాహం తరలివస్తోంది. ఆదివారం బరాజ్ వద్ద 54,820 క్యూసెక్కుల వరద ప్రవాహం రాగా, మొత్తం 85 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలేస్తున్నారు.
వృక్షాలు భద్రమేనా!
కాళేశ్వరం : కాళేశ్వరం దేవస్థానం కూల్చివేతల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలో ఉన్న ఉసిరి, కదంబ వృక్షాలు తొలగించడం లేదు. కానీ, ఆ వృక్షాలను తొలగించకుండా భద్రంగా కాపాడేందుకు దేవాదాయ శాఖ, కాంట్రాక్టర్లు చర్యలు తీసుకున్నట్లు తెలిసింది. పడమర వైపు ఉన్న ఉసిరి చెట్టు చుట్టూ మట్టి తీసి తొలగించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అలాగే శుభానంద దేవి (పార్వతీ) అమ్మవారి ఆలయానికి ఎదురుగా ఉండే కదంబ వృక్షాన్ని కూడా భద్రంగానే ఉంచుతున్నారు. ఈ రెండు వృక్షాలను భక్తులు విశ్వసిస్తారు.
సమస్యలు
పరిష్కరించడంలో విఫలం
భూపాలపల్లి అర్బన్ : సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో గెలుపొందిన ఏఐటీయూసీ కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో విఫలమైందని తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కామెర గట్టయ్య ఆరోపించారు. సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగి మూడేళ్లు కావొస్తుందన్నారు. ఎన్నికల్లో గుర్తింపు సంఘం గెలుపొందిన యూనియన్ కార్మికుల సమస్యలను విస్మరించింది తెలిపారు. ఎన్నికల ముందు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్నారు. సింగరేణి కార్మికుల మారుపేర్లు సవరిస్తామని, మెడికల్ బోర్డును పాత పద్ధతులు నిర్వహిస్తామని, సొంతింటి కల నెరవేరుస్తామని, నూతన బొగ్గు గనులను ఏర్పాటు, సింగరేణి కారిడార్‌ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన విషయాలను గుర్తు చేశారు.
భూ హక్కులను కాపాడాలి
వాజేడు : ఏజెన్సీ ప్రాంతంలో 1/70 చట్టానికి అనుగుణంగా భూముల రీ సర్వే చేపట్టాలని తుడుందెబ్బ రాష్ట్ర కార్యదర్శి పాయం జానకిరమణ కోరారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. ఏజెన్సీలో గిరిజనుల భూములకు ప్రత్యేక రక్షణ ఉందని 5వ షెడ్యూల్ స్ఫూర్తికి అనుగుణంగా భూ హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. గిరిజనుల భూములు గిరిజనేతరుల చేతుల్లోకి వెళ్లకుండా చూడాలన్నారు.
రూ. రెండున్నర కోట్లతో ఉడాయించిన ట్రేడర్?
నర్సంపేట: నర్సంపేటలో ట్రేడర్‌గా కొనసాగుతూ రైతులు, వ్యాపారుల నుంచి కొనుగోలు చేసిన సుమారు రూ.రెండున్నర కోట్ల విలువ చేసే మక్కలు, ఇతర సరుకులతో ఓ ట్రేడర్ ఉడాయించినట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలానికి చెందిన వ్యాపారి గతేడాది నర్సంపేటలో ట్రేడ్ లైసెన్స్ తీసుకుని మక్కలు కొనుగోలు చేస్తున్నాడు. మొదట్లో కొనుగోలు చేసిన వెంటనే డబ్బులు చెల్లించి మంచి పేరు పొందిన తర్వాత ఈ ఏడాది ఇతర వ్యాపారుల కంటే ఎక్కువ రేటు వెచ్చించి భారీ మొత్తంలో సరుకులు కొనుగోలు చేశాడు. ములుగు ప్రాంతానికి చెందిన చిరు వ్యాపారుల నుంచి భారీ మొత్తంలో కొనుగోలు చేసి సుమారు రూ.రెండున్నర కోట్ల మేర బకాయిపడి డబ్బులు చెల్లించకుండా పరారైనట్లు తెలిసింది. రెండు రోజుల క్రితం ములుగుకు చెందిన ఓ వ్యాపారి ఈ విషయంపై ఏసీపీ రవీందర్‌రెడ్డికి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.


