భూపాలపల్లి అర్బన్ : సింగరేణి యాజమాన్యం ఈ నెల 27లోగా కార్మికులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే అన్ని జాతీయ కార్మిక సంఘాలను కలుపుకొని సమ్మెకు వెళ్లడం తప్పదని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్ హెచ్చరించారు. ఆదివారం ఏరియాలోని ఏఐటీయూసీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సింగరేణి వ్యాప్తంగా కార్మికులకు పనిముట్లు అందించడంలో యాజమాన్యం విఫలమైందని ఆరోపించారు. అరిగిపోయిన పనిముట్లతో కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. గనుల్లో భద్రతా ప్రమాణాలు మెరుగుపరచాలని, సాధారణ మరణాల సందర్భంలో కార్మిక కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. పెర్క్స్‌పై ఆదాయపన్ను విషయంలో ప్రభుత్వం మొండి వైఖరి వీడి కార్మికులకు న్యాయం చేయాలని కోరారు. 31 డిమాండ్లను యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లగా 20 డిమాండ్లను అంగీకరించినప్పటికీ అమలులో జాప్యం చేస్తోందన్నారు. డిస్మిస్ కార్మికుల సమస్యలు, క్యాడర్ స్కీం, వైద్య సౌకర్యాలు తదితర సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్మిక సమస్యలను పరిష్కరించకపోతే అన్ని సంఘాలను ఏకతాటిపైకి తెచ్చి పోరాటం ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఏఐటీయూసీ నాయకులు మాతంగి రామచందర్, జి.సుధాకర్‌రెడ్డి, జి. శ్రీనివాస్, ఎం.డి. ఆసిఫ్‌పాషాలు పాల్గొన్నారు.


