న్యూస్‌రీల్
మా వేతనాలు తగ్గించొద్దు
కొత్త జీఓతో తీవ్ర నష్టం..
భూపాలపల్లి: మున్సిపాలిటీలో ఔట్‌సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న కార్మికుల వేతనాల తగ్గింపునకు రంగం సిద్ధమైంది. గతేడాది తీసుకొచ్చిన జీఓను ఇప్పుడు అమలుచేసి వేతనాల్లో కోత విధించేందుకు సర్కారు ప్రయత్నిస్తుంది. కొత్త జీఓ అమలు సరికాదంటూ భూపాలపల్లి మున్సిపాలిటీలోని కార్మికులు తమ వేతనాలు తీసుకునేందుకు తిరస్కరించారు.
ఆ వేతనం మాకొద్దు..
జీఓ ఆర్టీ 69 గతేడాది విడుదల కాగా ఈ నెల నుంచి ఆ జీఓ ప్రకారం వేతనాలు ఇచ్చేందుకు అధికారులు సిద్ధమయ్యారు. పాత జీఓల ప్రకారమే తమకు వేతనాలు ఇవ్వాలని, కొత్త జీఓ అమల్లోకి వస్తే వేతనాలు తగ్గి తాము ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటామని భూపాలపల్లి మున్సిపాలిటీలోని ఔట్‌సోర్సింగ్ కార్మికులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. స్థానిక మున్సిపాలిటీలో 150మంది కార్మికులు పనిచేస్తుండగా, వారంతా గత నెల వేతనాన్ని తీసుకోకుండా నిరసన వెలిబుచ్చుతున్నారు. నిత్యావసర సరుకుల ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయని, కుటుంబాలను సాకేందుకు ఇబ్బందులు పడుతున్న క్రమంలో వేతనాలు పెంచాల్సింది పోయి ఉన్న ఫళంగా కొత్త జీఓ తీసుకొచ్చి వేలాది రూపాయల కోత విధిస్తే తమ కుటుంబాలు రోడ్డున పడుతాయని వాపోతున్నారు. జీఓ 69ని రద్దుచేసి పాత పద్ధతి ప్రకారమే వేతనాలు అందించాలని ఔట్‌సోర్సింగ్ కార్మికులు ఇటీవల ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావును కలిసి కోరారు.
మున్సిపాలిటీలో వివిధ విభాగాల్లో సిబ్బంది కొరత కారణంగా ప్రభుత్వం ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో స్థానిక నిరుద్యోగ యువతకు అవకాశాలు కల్పించింది. జీఓ ఎంఎస్ నంబర్ 14 (2016) ప్రకారం పని ఆధారంగా రూ.12వేల నుంచి రూ.15వేల వరకు వేతనం ఇచ్చింది. అనంతరం ప్రభుత్వం జీఓ ఎంఎస్ 60, జీఓ ఎంఎస్ 40 లను విడుదల చేసి వేతనాలు పెంపు చేస్తూ వచ్చింది. గతేడాది ఫిబ్రవరి 3వ తేదీన ప్రభుత్వం కొత్త జీఓ ఆర్టీ నంబర్ 69ను విడుదల చేసింది. ఈ జీఓ ప్రకారం ప్రస్తుతం కార్మికులకు ఉన్న వేతనాలు రూ.2వేల నుంచి రూ.4వేల వరకు తగ్గనున్నాయి. దీంతో ఔట్ సోర్సింగ్ కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మున్సిపాలిటీ ఔట్‌సోర్సింగ్
కార్మికుల వేతనాల తగ్గింపు
గతేడాది జీఓ అమలుకు
సర్కారు యత్నం
నెలకు రూ.4వేల వరకు
తగ్గుతున్న వేతనం
నిరసనగా జూలై నెల వేతనం
తిరస్కరణ


