నర్సంపేట: బీఆర్‌ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం వరంగల్ జిల్లా నల్లబెల్లిలోని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ఇంటికి రానున్నారు. పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. కష్టకాలంలో ఉన్న వారికి భరోసా ఇవ్వనున్నారు. పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని ఆదుకునేందుకు కేసీఆర్ ఇప్పటికే ఆర్థిక సాయం ప్రకటించిన విషయం విదితమే.
‘సర్’కు
రెండు రోజులే గడువు
భూపాలపల్లి: రాష్ట్రంలో కొనసాగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ 2026 కార్యక్రమం రేపటి(సోమవారం) తో ముగుస్తుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్‌శర్మ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని ఓటర్లందరికీ ఇది చివరి అవకాశమన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు పూరించిన ఎన్యూమరేషన్ ఫారం సమర్పించడానికి ఆగస్టు 10 చివరి తేదీగా నిర్ణయించినట్లు తెలిపారు. గడువులోగా ఫారం సమర్పించని పక్షంలో, ఆగస్టు 17న విడుదలయ్యే ముసాయిదా ఓటర్ల జాబితాలో పేరు నమోదు కాబడదని కలెక్టర్ తెలిపారు.
రాష్ట్ర ట్రెజరీశాఖ డైరెక్టర్ పూజలు
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఉత్సవమూర్తులను శ్రీఽఆదిముక్తీశ్వరాయంలో ఏర్పాటుచేసిన బాలాలయంలో రాష్ట్ర ట్రెజరీశాఖ డైరెక్టర్ పార్వతీదేవి శనివారం దర్శించుకున్నారు. అక్కడ ఆశీర్వచన వేదిక వద్ద ఆమెను అర్చకులు సన్మానించి, తీర్థప్రసాదం అందజేసి ఆశీర్వచనం అందజేశారు. ఆమెవెంట జిల్లా ట్రెజరీశాఖ అధికారులు జ్యోతిరావు, జీవన్‌రెడ్డి, రాజేంద్రప్రసాద్ తదితరులు ఉన్నారు.
రోడ్డుపై ‘చేపల వేట’తో నిరసన
భూపాలపల్లి అర్బన్: జిల్లాకేంద్రంలోని సుభాష్ కాలనీలో రోడ్డు నిర్మాణ పనులు నత్తనడకన సాగుతుండటంపై బీఆర్‌ఎస్ యూత్ ఆధ్వర్యంలో శనివారం వినూత్న నిరసన చేపట్టారు. బీఆర్‌ఎస్ అర్బన్ యూత్ ప్రధాన కార్యదర్శి మహేందర్‌యాదవ్ నేతృత్వంలో నిర్వహించిన ఈ నిరసనలో రోడ్డుపై నిలిచిన వర్షపు నీటిలో చేపల వలలు, గాలాలు వేసి చేపలు పడుతూ తమ నిరసన తెలిపారు. రోడ్డు నిర్మాణ పనులు అర్ధాంతరంగా నిలిచిపోవడంతో వర్షపు నీరు భారీగా నిలిచి గుంతలు చెరువులను తలపిస్తున్నాయని యూత్ నాయకులు ఆవేదన వ్యక్తంచేశారు. దీంతో కాలనీవాసులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
హేమాచలక్షేత్రంలో
భక్తుల రద్దీ
మంగపేట: మండల పరిధిలోని మల్లూరు శ్రీహేమాచల క్షేత్రంలో శనివారం భక్తుల రద్దీ నెలకొంది. కోరిన కోర్కెలు తీర్చుతూ, సంతానభాగ్యం కల్పించే స్వయంభు లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకునేందుకు భక్తులు సుదూర ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చారు. ఉదయాన్నే గుట్టపైకి చేరుకుని పవిత్ర చింతామణి జలపాతం వద్ద పుణ్యస్నానాలు ఆచరించి భక్తిశ్రద్ధలతో లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకున్నారు. పూలు పండ్లు, పట్టు వస్త్రాలు సమర్పించారు. ఉదయం 10 నుంచి 12 గంటల వరకు ఆలయ అర్చకులు ముక్కామల రాజశేఖర్‌శర్మ, పవన్‌కుమార్ ఆచార్యులు, ఈశ్వర్‌చంద్‌శర్మ, అనిపెద్ది రాజీవ్ శర్మ నిర్వహించిన తిలతైలాభిషేకం పూజలో పాల్గొని మానవ శరీరాన్ని పోలి ఉండే స్వామివారిని దర్శించుకుని పులకించారు. సంతానం కోసం స్వామివారి నాభిచందన ప్రసాదం స్వీకరించేందుకు వచ్చిన దంపతులకు అర్చకులు ప్రసాదాన్ని పంపిణీ చేసి వేద మంత్రోచ్ఛరణతో ఆశీర్వచనం ఇచ్చారు.


