వేజ్‌బోర్డు కమిటీ ఏర్పాటు చేయాలి | - | Sakshi
Sakshi News home page

వేజ్‌బోర్డు కమిటీ ఏర్పాటు చేయాలి

Aug 9 2026 1:46 AM | Updated on Aug 9 2026 1:46 AM

రేపు జీఎం కార్యాలయాల ఎదుట ధర్నా

భూపాలపల్లి అర్బన్‌: సింగరేణి యాజమాన్యం, కేంద్ర ప్రభుత్వం వెంటనే 12వ వేజ్‌బోర్డు కమిటీని ఏర్పాటుచేసి వేతన సవరణ ప్రక్రియను వేగంగా అమలుచేయాలని జాతీయ కార్మిక సంఘాల జేఏసీ నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ నెల 10న సింగరేణి వ్యాప్తంగా జీఎం కార్యాలయాల ఎదుట ధర్నాలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. శనివారం ఏరియాలోని కొమురయ్య భవన్‌లో జాతీయ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్‌, సీఐటీయూ ప్రధాన కార్యదర్శి మంద నర్సింగరావు, ఐఎన్‌టీయూసీ కేంద్ర కమిటీ ఉపాధ్యక్షుడు జోగ బుచ్చయ్య, హెచ్‌ఎంఎస్‌ నాయకులు నరేష్‌నేత మాట్లాడారు. గతంలో 11వ వేజ్‌బోర్డు కాలపరిమితి ముగియకముందే కమిటీని ఏర్పాటుచేసి వేతన సవరణ అమలు చేశారని గుర్తుచేశారు. ప్రస్తుతం 12వ వేజ్‌బోర్డు సమయం దాటినా కమిటీని ఏర్పాటు చేయకపోవడం ఎందుకని వారు ప్రశ్నించారు. కోలిండియా స్థాయిలో 12వ వేజ్‌బోర్డు ఏర్పాటు అంశంపై చర్చించాల్సి ఉండగా, లేబర్‌ కోడ్‌ల అమలుపైనే దృష్టి సారించడం సరికాదన్నారు. సింగరేణిలో కార్మికులపై లేబర్‌ కోడ్‌లను అమలు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. వేజ్‌బోర్డు విషయంలో అన్ని కార్మిక సంఘాలు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ నెల 10న జీఎం కార్యాలయాల ఎదుట జరగనున్న ధర్నాలో బీఎంఎస్‌ పాల్గొనకపోవడం బాధాకరమని, కార్మికుల ప్రయోజనాల కోసం వేజ్‌బోర్డు విషయంలో కలిసి రావాలని కోరారు. సెప్టెంబర్‌ 12న రాంచీలో జరిగే సదస్సులో 12వ వేజ్‌బోర్డు అంశంపై స్పష్టత రాకపోతే కోల్‌ఇండియా వ్యాప్తంగా సమ్మెకు సిద్ధమవుతామని హెచ్చరించారు. ఇప్పటికై నా కేంద్ర ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం స్పందించి వేజ్‌బోర్డు కమిటీని వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. జీఎం కార్యాలయాల ఎదుట నిర్వహించే ధర్నా కార్యక్రమానికి కార్మికులు, ట్రేడ్‌యూనియన్‌ నాయకులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో వివిధ సంఘాల నాయకులు మోటపలుకుల రమేశ్‌, రాంచందర్‌, ఐలయ్య, బీమనాదుని సత్యనారాయణ, రామచందర్‌, దుడ్డేల సాయిలు, రమేశ్‌, మల్లేశ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement