పార్కును అభివృద్ధి చేయడమే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

పార్కును అభివృద్ధి చేయడమే లక్ష్యం

Aug 9 2026 1:46 AM | Updated on Aug 9 2026 1:46 AM

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు

జయశంకర్‌ పార్కు పరిశీలన

పనులకు రూ.50లక్షలు కేటాయింపు

భూపాలపల్లి రూరల్‌: జయశంకర్‌ పార్క్‌ను ప్రజలకు మరింత ఆహ్లాదకరంగా, ఆరోగ్యకరంగా సురక్షితంగా ఉండేలా అభివృద్ధి చేయడమే లక్ష్యమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు తెలిపారు. శనివారం సంగరేణి ఏరియా జీఎం ఏనుగు రాజేశ్వర్‌రెడ్డితో కలిసి ఎమ్మెల్యే జయశంకర్‌ పార్క్‌ను పరిశీలించారు. పార్కులో ఉన్న జిమ్‌ పరికరాలను పరిశీలించారు. అభివృద్ధి పనులపై అధికారులకు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అభివృద్ధికి సింగరేణి సీఎస్‌ఆర్‌ నిధుల నుంచి రూ.50 లక్షలు కేటాయించినట్లు చెప్పారు. సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో పార్కు నిర్వహిస్తూ, ప్రజలకు మరింత మెరుగైన వసతులు కల్పించేందుకు చర్యలు చేపడుతున్నామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ నిధులతో పార్క్‌లో వాకింగ్‌ చేసే ప్రజలకు ఇబ్బందులు లేకుండా అవసరమైన వాకింగ్‌ ట్రాక్‌, మౌలిక వసతులు, మరమ్మతులు, లైటింగ్‌ తదితర అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. పార్క్‌ అభివృద్ధి పనులను చేపట్టే ముందు ఇంజినీరింగ్‌ నిపుణుల సలహాలతో పాటు వాకర్స్‌, స్థానిక ప్రజలు, కార్మికులు, సంబంధిత వర్గాల అభిప్రాయాలను తీసుకుని, వారికి అవసరమైన సౌకర్యాలను గుర్తించి పనులు చేపట్టాలని సూచించారు. పార్క్‌లో ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణంలో వివిధ రకాల జ్యూస్‌లు, పానీయాలు అందుబాటులో ఉండేలా క్యాంటీన్‌ను కూడా అవసరమైన మేరకు మరమ్మతులు చేసి అందుబాటులోకి తీసుకురావాలని తెలిపారు. పార్క్‌ పరిసరాల్లో మెరుగైన లైటింగ్‌ సదుపాయాలు ఏర్పాటుచేసి వాకింగ్‌చేసే ప్రజలకు భద్రత కల్పించేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఎమ్మెల్యే వెంట పార్టీ జిల్లా అధ్యక్షుడు బట్టు కరుణాకర్‌, కౌన్సిలర్లు, నాయకులు పుల్ల మహేష్‌, దాట్ల శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement