హేమాచలక్షేత్రంలో భక్తుల సందడి | - | Sakshi
Sakshi News home page

హేమాచలక్షేత్రంలో భక్తుల సందడి

Aug 10 2026 1:28 AM | Updated on Aug 10 2026 1:28 AM

మంగపేట: మండల పరిధిలోని మల్లూరుగుట్టపై నెలకొన్న శ్రీహేమాచల క్షేత్రంలో ఆదివారం భక్తులు సందడి నెలకొంది. శ్రీలక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకునేందుకు వేలాదిగా భక్తులు తరలిరావడంతో ఆలయం కిటకిట లాడింది. రాష్ట్రంలోని హైదరాబాద్‌, వరంగల్‌, ఖమ్మం తదితర ప్రాంతాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, విశాఖ పట్టణం వంటి సుదూర ప్రాంతాల నుంచి భక్తులు ఉదయాన్నే గుట్టపైకి చేరుకున్నారు. ఆలయ సమీపంలో పవిత్ర చింతామణి జలపాతం వద్ద పుణ్యస్నానాలు ఆచరించి అత్యంత భక్తిశ్రద్ధలతో ఆలయంలోని స్వామివారిని దర్శించుకున్నారు. ఉదయం 10నుంచి 12 గంటల వరకు ఆలయ అర్చకులు ముకాకమల రాజశేఖర్‌శర్మ, పవన్‌కుమార్‌ ఆచార్యులు, ఈశ్వర్‌చంద్‌ శర్మ, రాజీవ్‌ శర్మ స్వామివారికి తిలతైలాభిషేక పూజా కార్యక్రమాలను నిర్వహించి భక్తుల పేరిట గోత్రనామాలతో ప్రత్యేక అర్చనలు జరిపించారు. స్వామివారి విశిష్టత, ఆలయ పురాణాన్ని భక్తులకు వివరించారు.

రామలింగేశ్వరస్వామికి పూజలు

వెంకటాపురం(ఎం): చారిత్రక రామప్ప దేవాలయంలో ఆదివారం భక్తుల కోలాహలం నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి సందర్శకులు అధిక సంఖ్యలో తరలివచ్చి రామప్ప రామలింగేశ్వరస్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఆలయ పూజారులు భక్తులకు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వదించగా టూరిజం గైడ్‌లు ఆలయ విశిష్టత గురించి వివరించారు. అనంతరం రామప్ప సరస్సులో బోటు షికార్‌ చేసి సరస్సు అందాలను తిలకించారు.

నమ్మకంతో

పోరాడుతున్నాం

కాశిబుగ్గ: న్యాయ వ్యవస్థపై తమకు అపారమైన విశ్వాసం ఉందని, అదే నమ్మకంతోనే కార్మికుల పక్షాన పోరాడుతున్నామని ఆజంజాహి మిల్స్‌ వీఆర్‌ఎస్‌ ఎంప్లాయీస్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ కార్యవర్గ సభ్యులు తెలిపారు. ఆదివారం వరంగల్‌ చింతల్‌ బ్రిడ్జి వద్ద వీఆర్‌ఎస్‌ అసోసియేషన్‌ కార్మికుల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు కుడికాల కుమారస్వామి, జన్ను రమేశ్‌ మాట్లాడుతూ.. 134 మంది మిల్లు కార్మికులకు 200 గజాల చొప్పున ఇచ్చినట్లుగానే మిగతా 318 మందికి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కార్మికులకు న్యాయం చేయాలని కోరారు. సమావేశంలో పాండవుల సమ్మయ్య, తౌటం రమేశ్‌, సంజీవ్‌ పాల్గొన్నారు.

వర్షాలకు కూలిన ప్రహరీ

ఏటూరునాగారం: మండల కేంద్రంలోని తాళ్లగడ్డ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల ప్రహరీ ఇటీవల కురిసిన వర్షాలకు కూలిపోయింది. బాలికలకు రక్షణగా ఉండే ప్రహరీ కూలిపోయినా సంబంధిత ఆశ్రమ పాఠశాల వార్డెన్‌, ప్రధానోపాధ్యాయులు ఈ విషయంపై ఏమాత్రమూ స్పందించడం లేదు. ప్రహరీ లేకపోవడంతో అపరిచిత వ్యక్తులు రాత్రి సమయాల్లో లోనికివెళ్లే ప్రమాదం ఉంది. ప్రహరీ కూలిపోయిన విషయాన్ని ఐటీడీఏ గిరిజన సంక్షేమశాఖ డీడీ, ఇంజనీరింగ్‌ అధికారులకు కూడా సమాచారం ఇవ్వకుండా నిర్లక్ష్యంగా ఉన్న వార్డెన్‌, ప్రధానోపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని గిరిజనులు కోరుతున్నారు. బాలికల రక్షణకు వెంటనే నూతనంగా ప్రహరీని నిర్మించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ఈ విషయంపై డీడీ జనార్దన్‌ ను వివరణ కోరగా అక్కడ ఉన్న పరిస్థితి వెంటనే పరిశీలించి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement