కాగితాలకే.. హక్కులు | - | Sakshi
Sakshi News home page

కాగితాలకే.. హక్కులు

Jul 17 2026 1:10 AM | Updated on Jul 17 2026 1:10 AM

కాళేశ్వరం: సాగు హక్కుల కోసం అడవిలో పోరాడిన రైతులు.. ఇప్పుడు పెట్టుబడి సహాయం కోసం బ్యాంకర్లతో పోరాడాల్సిన పరిస్థితి వచ్చింది. పోడు పట్టాలు పొందిన గిరిజన రైతులకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు ససేమిరా అంటున్నారు. సాంకేతిక కారణాలు చూపుతూ రుణాలు ససేమిరా అంటుండడంతో పట్టాలు చేతిలో ఉన్నా పెట్టుబడి సాయం దక్కని పరిస్థితి నెలకొంది. వానాకాలం సాగు సీజన్‌ ముంచుకొస్తుండడంతో పెట్టుబడి కోసం గిరిజన రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలోని ఏజెన్సీ రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

4,852 ఎకరాల్లో పట్టాలు

కాటారం డివిజన్‌లోని కాటారం, మహాముత్తారం, పలిమెల, మహదేవపూర్‌ మండలాల్లో 2022 సంవత్సరంలో 2,076 మంది పోడు రైతులకు 4,852 ఎకరాల్లో ప్రభుత్వం పట్టాలు ఇచ్చింది. అటవీశాఖ ద్వారా రైతులు పట్టాలు పొందినా బ్యాంకుల్లో మాత్రం రుణాలు ఇవ్వడం లేదు. ధరణి సంబంధిత సాంకేతిక సమస్యల కారణంగా ఆ భూములు ఆన్‌లైన్‌లో నమోదు కాలేదని .. ప్రస్తుతం భూభారతి పోర్టల్‌లో కూడా ఆ భూముల వివరాలు కనిపించకపోవడంతో వాటిని బ్యాంకులు చెల్లుబాటు అయ్యే రికార్డులుగా పరిగణించడం లేదు. దీంతో పంట రుణాలు మంజూరు చేయడం లేదు. బ్యాంకుల చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతున్నా కనికరం చూపడం లేదు.

పెట్టుబడి సాయం..

గతంలో రుణాలు పొందిన రైతులకు మాత్రమే రుణాల రెన్యూవల్‌ జరుగుతుండగా, కొత్తగా రుణాలు కోరుతున్న వారికి బ్యాంకర్లు సహకరించడం లేదు. వానాకాలం సీజన్‌ కావడంతో విత్తనాలు, ఎరువులు, కూలీల ఖర్చుల కోసం అత్యవసరంగా పెట్టుబడి అవసరమైన సమయంలో రుణాలు అందకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అసలే తీవ్ర వర్షాభావం పరిస్థితులు.. రుణాలు అందకపోతే సాగు పనులు దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పోడురైతులకు అందని రుణాలు

భూభారతి పోర్టల్‌లో కనిపించని

వివరాలు

రుణాలిచ్చేందుకు ససేమిరా అంటున్న బ్యాంకర్లు

పెట్టుబడుల కోసం బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు

ఇబ్బందులు పడుతున్న గిరిజనులు

భూభారతి పోర్టల్‌లో నమోదు కాలేదు..

పాత పంట రుణాలను మాత్రమే రెన్యూవల్‌ చేస్తున్నాం. భూభారతి పోర్టల్‌లో పోడు రైతుల పట్టాలు నమోదు కాలేదు. ఆన్‌లైన్‌లో కనిపించడం లేదు. దీంతో బ్యాంకు రూల్స్‌ ప్రకారం రుణాలు ఇవ్వడం కుదరదు. రైతులు బ్యాంకుల చుట్టూ తిరుగుతిన్నది నిజమే.

– ఎ.తిరుపతి, జిల్లా లీడ్‌ బ్యాంకు మేనేజర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement