● కలెక్టర్ రాహుల్ శర్మ
భూపాలపల్లి: రహదారి నియమాలు పాటిస్తూ వాహనదారులు బాధ్యతతో వాహనాలు నడిపితే ప్రమాదాలను నివారించవచ్చని కలెక్టర్ రాహుల్‌శర్మ అన్నారు. గురువారం ఐడీఓసీ కార్యాలయంలో రహదారి భద్రతపై పోలీస్, రవాణా, ఆర్‌అండ్‌బీ, మున్సిపల్, పంచాయతీరాజ్, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్, విద్యాశాఖ అధికారులతో జిల్లా రహదారి భద్రతా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ప్రమాదాలకు గురయ్యే బ్లాక్ స్పాట్స్‌ను గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రహదారులపై ప్రమాదాలు జరిగే చోట సూచిక బోర్డులు, రేడియం స్టిక్కర్స్ ఏర్పాటు చేయడం, వీధి దీపాల ఏర్పాటు వంటి మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని సూచించారు. రహదారులపై పశువుల సంచారాన్ని నియంత్రించాలని ఆదేశించారు. రహదారి ప్రమాదం సంభవించినప్పుడు బాధితులను గంటలోపు ఆస్పత్రికి తరలించడం అత్యంత ముఖ్యమన్నారు. అలా సహాయం చేసిన వారికి ‘రహావీర్ అవార్డు’తో పాటు రూ.25వేల నగదు ప్రోత్సాహకంగా అందజేయనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ నరేష్‌కుమార్, డీటీఓ శ్రీనివాస్, ఆయా శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
సీ్త్ర నిధి రుణాలను
సద్వినియోగం చేసుకోవాలి..
మహిళా సంఘాల సభ్యులు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సీ్త్ర నిధి రుణాలను సద్వినియోగం చేసుకొని ఆర్థిక స్వావలంబన సాధించాలని కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. గురువారం ఐడీఓసీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో మహిళా సమాఖ్య సభ్యులు, గ్రామీణ అభివృద్ధి శాఖ, సహకార, పశు సంవర్ధక, మున్సిపల్, పంచాయతీ శాఖ, మెప్మా, సెర్ప్ అధికారులు, కోఆర్డినేటర్లు, ఏపీఎంలతో జిల్లా స్థాయి సీ్త్ర నిధి సమీక్ష కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సీ్త్ర నిధి రుణాల మంజూరులో రాష్ట్ర స్థాయిలో జిల్లా మూడో స్థానంలో ఉందని పేర్కొన్నారు. మహాముత్తారం, పలిమెల మండలాల్లో రుణాల వినియోగదారులు తక్కువగా ఉన్నారని, ఆ మండలాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
అప్రమత్తంగా ఉన్నాం..
సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉన్నామని, ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ రాహుల్ శర్మ వెల్లడించారు. తాగునీటి సరఫరా, సీజనల్ వ్యాధుల నియంత్రణ, విద్యా, వాతావరణ పరిస్థితులు, పౌర సరఫరాలు, ప్రజా పాలన తదితర అంశాలపై హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయం నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు గురువారం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్‌కు ఐడీఓసీ కార్యాలయం నుంచి కలెక్టర్ రాహుల్ శర్మ పాల్గొన్నారు.


