● మాజీ ఎమ్మెల్యే
గండ్ర వెంకటరమణారెడ్డి
● గణపసముద్రం, రామప్ప చెరువుల పరిశీలన
గణపురం: గణపసముద్రం చెరువు కింద ఆయకట్టు రైతాంగానికి సాగు నీటితో పాటు జిల్లా ప్రజలకు తాగునీటి సమస్య లేకుండా చూడాలని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం గణపసముద్రం, రామప్ప చెరువును బీఆర్‌ఎస్ నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గణపసముద్రం చెరువులో నీళ్లు ఉంటే గణపురం మండలంతో పాటు భూపాలపల్లి, చిట్యాల, టేకుమట్ల మండల రైతాంగానికి మోరంచవాగు ద్వారా నీరు అంది రెండు పంటలు పండించుకుంటారన్నారు. గణపసముద్రం చెరువు మిషన్ భగీరథ ద్వారా జిల్లాలోని 5 మండలాలకు తాగునీరు అందిస్తుందన్నారు. గణపసముద్రం చెరువును రిజర్వాయర్ చేస్తూ దేవాదుల ద్వారా రామప్ప సరస్సుకు నీటిని తరలించి అక్కడి నుంచి గ్రావిటీ కెనాల్ నిర్మాణానికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో నిధులు మంజూరు చేసినట్లు చెప్పారు. కానీ ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కెనాల్ నిర్మాణ పనులు చేయలేదన్నారు. రెండు రోజుల నుంచి దేవాదుల నుంచి రామప్పకు నీటిని పంపిస్తున్నారని.. రామప్ప ఫుల్‌లెవెల్ వాటర్ ట్యాంకును మెంటేన్ చేస్తూ గ్రావిటీ కెనాల్ ద్వారా గణపురం చెరువుకు నీటిని పంపు చేయాలన్నారు. చెరువును పూర్తిగా నింపి నిరంతరం ఫుల్ లెవల్ ట్యాంక్ మెంటేన్ చేస్తూ రైతాంగానికి సాగునీరు, ప్రజలకు తాగునీటి సమస్య లేకుండా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.


