● బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు
చందుపట్ల కీర్తి రెడ్డి
భూపాలపల్లి రూరల్: సింగరేణిపై బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో చేసిన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి సింగరేణి భరోసా యాత్రపై ఆరోపణలు చేస్తున్నాడని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు చందుపట్ల కీర్తి రెడ్డి విమర్శించారు. జిల్లాకేంద్రంలోని బీఎంఎస్ కార్యాలయంలో గురువారం విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్లే సింగరేణి ఇబ్బందుల్లో పడిందన్నారు. కేంద్ర బొగ్గు గనులశాఖ మంత్రి కిషన్‌రెడ్డి చొరవతో వేలం లేకుండా తాడిచెర్ల–2 బొగ్గు బ్లాక్‌ను సింగరేణికి కేటాయించినట్లు తెలిపారు. రామగుండం మంథిని, భూపాలపల్లి మీదుగా మణుగూరు వరకు రైల్వేలైన్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. బీఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు అప్పాని శ్రీనివాస్ మాట్లాడుతూ సింగరేణి కార్మికుల హక్కుల పరిరక్షణ, సమస్యల పరిష్కారమే బీఎంఎస్ ప్రధాన లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎరుకల గణపతి, సెంట్రల్ కార్యదర్శి సట్కూరి శ్రీనివాస్, బ్రాంచ్ కార్యదర్శి రాసకట్ల నర్సింగరావు, మల్లేష్ పాల్గొన్నారు.


