భూపాలపల్లి పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన ట్రాఫిక్ సిగ్నల్స్ ఏడాది క్రితం పని చేయకపోవడంతో స్థానిక పోలీసు అధికారులు సుమారు రూ.30 వేల వరకు వెచ్చించి మరమ్మతులు చేయించారు. అయితే నెల రోజుల క్రితం అవి మళ్లీ రిపేరు రావడంతో టెక్నీషియన్లను పిలిపించి చూపించారు. అయితే వారు ట్రాఫిక్ సిగ్నల్స్ బోర్డును బెంగుళూరు పంపించగా అది సరిచేయలేమని వెల్లడించారు. ట్రాఫిక్ సిగ్నల్స్‌ను రీస్టోరేషన్ లేదా రీ ప్లేస్‌మెంట్ చేయాలని, అందుకు సుమారు రూ.20 లక్షల వరకు ఖర్చు అవుతుందని సూచించారు. దీంతో స్థానిక పోలీసులు రిపేరు చేయించలేక, నిధుల కోసం మున్సిపాలిటీ అధికారులకు లేఖ రాశారు. అయితే స్థానిక అభివృద్ధి పనులకు సింగరేణి నిధులను వినియోగించుకునే అవకాశం ఉంది. అంతేకాక మున్సిపాలిటీ నిధులతోపాటు డీఎంఎఫ్‌టీ నిధులు భారీ మొత్తంలో ఉన్నాయి. అయినప్పటికీ నెల రోజుల నుంచి ట్రాఫిక్ సిగ్నల్స్ మరమ్మతు పనులపై రెవెన్యూ, పోలీసు, మున్సిపల్ అధికారులు దృష్టి సారించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


