సిగ్నల్స్‌ స్విచ్ఛాఫ్‌ | - | Sakshi
Sakshi News home page

సిగ్నల్స్‌ స్విచ్ఛాఫ్‌

Jul 16 2026 5:00 AM | Updated on Jul 16 2026 5:00 AM

భూపాలపల్లి: జిల్లా కేంద్రమైన భూపాలపల్లి పట్టణంలో ట్రాఫిక్‌ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. ప్రధాన జంక్షన్‌లో ఏర్పాటు చేసిన ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ నెల రోజులుగా మూగబోయాయి. సిగ్నల్స్‌ స్విచ్చాఫ్‌ కావడంతో వాహనదారులు ఎటు వెళ్లాలో తెలియక, ఏ వైపు నుంచి ఏ వాహనం దూసుకొస్తుందో అర్ధం కాక ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొంది.

చేతులూపుతూ సిగ్నల్‌..

ఇసుక, సింగరేణి బొగ్గు లారీలతోపాటు మంచిర్యాల, గోదావరిఖని, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల నుంచి వందలాది వాహనాలు ప్రతీ రోజు భూపాలపల్లి జాతీయ రహదారి మీదుగా రాకపోకలు సాగిస్తుంటాయి. అయితే ట్రాఫిక్‌ భారీగా పెరగడంతో పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలని భావించి మూడేళ్ల క్రితం జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్‌ చౌరస్తాలో ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ ఏర్పాటు చేశారు. అంతకుముందు ఆ చౌరస్తాలో నిత్యం ప్రమాదాలు చోటు చేసుకోగా సిగ్నల్స్‌ ఏర్పాటు చేశాక తగ్గుముఖం పట్టాయి. అయితే నెల రోజులుగా సిగ్నల్స్‌ పనిచేయడం లేదు. దీంతో ట్రాఫిక్‌ పోలీసులు చేసేది లేక వాహనాల రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో చేతులూపుతూ సూచనలిస్తూ వాహనాల రాకపోకలను నియంత్రిస్తున్నారు. అయినప్పటికీ ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. పాదాచారులు రోడ్డు క్రాస్‌ చేయలేని పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉండగా రాత్రి 6 గంటల నుంచి 10 గంటల వరకు విపరీతమైన ట్రాఫిక్‌ ఉంటుండటంతో పోలీసులు రోడ్డు మధ్యలో నిలబడి ట్రాఫిక్‌ సేఫ్టీ బాటన్‌ లైట్లతో విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలో ఏదైనా వాహనం అదుపు తప్పితే పరిస్థితి ఏంటనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.

డీటీఓ దుర్మరణం

మరువకముందే..

జూన్‌ 22వ తేదీన జాతీయ రహదారిపై బొగ్గులారీ అదు పు తప్పి ఢీ కొట్టిన ఘటనలో జిల్లా రవాణాశాఖ అధికారి వెంకన్న దుర్మరణం పాలైన ఘటన జిల్లా మొత్తాన్ని దిగ్బ్రాంతికి గురి చేసింది. పెద్ద ప్రమాదం జరిగి ఒక ఉన్నతాధికారి ప్రాణాలు కోల్పోయినా.. అధికారుల్లో స్పందన కరువైందనే విమర్శలున్నాయి. ప్రధాన కూడళ్లలో సిగ్నల్స్‌ వ్యవస్థను పునరుద్దరించకపోవడం గమనార్హం. మరో ప్రమాదం జరిగితేనే పట్టించుకుంటారా.? అని ప్రజలు, వాహనదారులు ప్రశ్నిస్తున్నారు.

జిల్లా కేంద్రంలో పని చేయని

ట్రాఫిక్‌ సిగ్నల్స్‌

చేతులతోనే సూచికలిస్తున్న

ట్రాఫిక్‌ పోలీసులు

నెల రోజులుగా వాహనదారులకు ఇబ్బందులు

జాతీయ రహదారిపై ఇటీవలే

డీటీఓ వెంకన్న దుర్మరణం

మరో ప్రమాదం జరిగితేనే

పట్టించుకుంటారా..?

త్వరలోనే మరమ్మతులు చేయిస్తాం..

పట్టణంలోని ట్రాఫిక్‌ సిగ్నల్స్‌కు సంబంధించిన మదర్‌బోర్డు పోయింది. కొత్త బోర్డుకు సుమారు రూ.20 లక్షల వరకు ఖర్చు అవుతుంది. నిధుల విడుదల కోసం మున్సిపాలిటీ అధికారులకు లేఖ రాశాం. త్వరలోనే మరమ్మతులు చేయిస్తాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement