నేడు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి రాక | - | Sakshi
Sakshi News home page

నేడు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి రాక

Jul 13 2026 1:16 AM | Updated on Jul 13 2026 1:16 AM

భూపాలపల్లి రూరల్‌: సింగరేణి భరోసా యాత్రలో భాగంగా కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌ రాంచందర్‌రావు నేడు (సోమవారం) భూపాలపల్లి రానున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఏడునూతుల నిశిధర్‌రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పట్టణంలోని ఎల్‌వీ కన్వెన్షన్‌ హాల్‌లో సమావేశానికి హాజరై కార్యకర్తలకు దిశానిర్ధేశం చేయనున్నారు. రాత్రి జెన్‌కో గెస్ట్‌హౌస్‌లో విశ్రాంతి తీసుకుని మంగళవారం ఉదయం గని గేట్‌ మీటింగ్‌లో పాల్గొంటారని చెప్పారు. అనంతరం తాడిచర్ల ఓపెన్‌ కాస్ట్‌ గనిని సందర్శించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

మత్స్యకారుల విభాగం

జిల్లా చైర్మన్‌గా రమేశ్‌

మహాముత్తారం: కాంగ్రెస్‌ పార్టీ మత్స్యకారుల విభాగం జిల్లా చైర్మన్‌గా మహాముత్తారం మండలం యామన్‌పల్లి గ్రామానికి చెందిన అట్టెం రమేశ్‌ ముదిరాజ్‌ను నియమించినట్లు పిషరీష్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర చైర్మన్‌ మెట్టు సాయికుమార్‌ ఆదివారం ఉత్తర్వులు జారీచేశారు. ఈ సందర్భంగా రమేశ్‌ మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో పాటు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు బట్టు కరుణాకర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

ఎక్సలెన్స్‌ ప్రవేశ పరీక్ష

ప్రశాంతం

భూపాలపల్లి అర్బన్‌:జిల్లాలో యంగ్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ 2026–27 విద్యా సంవత్సరానికి ఆరవ తరగతి ప్రవేశ పరీక్ష ఆదివారం ప్రశాంతంగా నిర్వహించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ఎం.రాజేందర్‌, జీసీడీఓ వి.శైలజ తెలిపారు. జిల్లాలో ఎంపికై న కాటారం, చిట్యాల, టేకుమట్ల కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలకు సంబంధించి మొత్తం 108 మంది విద్యార్థినులు దరఖాస్తు చేసుకోగా, 75 మంది పరీక్షకు హాజరయ్యారు. ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించిన ఈ పరీక్ష ద్వారా మూడు కేజీబీవీలలో ఒక్కో పాఠశాలకు 20 మంది చొప్పున మొత్తం 60 సీట్లను భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు. పరీక్షా కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్‌, వైద్య సదుపాయాలు కల్పించడంతో పాటు అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ ప్రవేశ పరీక్షలో ఎంపికై న విద్యార్థినులకు పూర్తి రెసిడెన్షియల్‌ సౌకర్యాలతో నాణ్యమైన విద్య అందించడంతో పాటు జాతీయస్థాయి పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ, సాంస్కృతిక, క్రీడలు, వృత్తి విద్య, యోగా వంటి అంశాల్లో కూడా శిక్షణ అందించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి తెలిపారు.

నియోజకవర్గ కన్వీనర్‌గా పైడిపల్లి రమేశ్‌

భూపాలపల్లి అర్బన్‌: తెలంగాణ ఉద్యమకారుల ఫోరం భూపాలపల్లి నియోజకవర్గ కన్వీనర్‌గా పైడిపల్లి రమేశ్‌ను నియమించినట్లు వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్‌ చీమ శ్రీనివాస్‌ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో రమేశ్‌ జేఏసీ కన్వీనర్‌గా పోరాటాలు నిర్వహించినట్లు తెలిపారు.

పాండవుల గుట్టల్లో

రాక్‌ క్లైంబింగ్‌

రేగొండ: సాహసాలు ఇష్టపడే వారికి క్లైంబింగ్‌ ఓ గొప్ప అనుభూతి. మండలంలోని తిరుమలగిరి శివారులోని పాండవుల గుట్టల్లో హైదరాబాద్‌లోని ఓ ఇంజనీరింగ్‌ కళాశాలకు చెందిన 40 మంది విద్యార్థులు అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నైట్‌ క్యాంప్‌లో శనివారం బసచేశారు. విద్యార్థులు ఆదివారం పాండవుల గుట్టలను సందర్శించి ఉత్సాహంగా రాక్‌ క్లైంబింగ్‌ చేశారు. పాండవుల గుట్టలను సందర్శించే పర్యాటకుల కోసం అవసరమైన ఏర్పాట్లు చేయనున్నట్లు ఎఫ్‌ఆర్‌ఓ చంద్రమౌళి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement