రేగొండ: అర్హులైన రైతులకు ఇబ్బందులు కలుగకుండా సాదాబైనామా ప్రక్రియను వేగవంతం చేసి త్వరగా పరిష్కరించాలని అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ అధికారులను ఆదేశించారు. గురువారం కొత్తపల్లిగోరి మండలంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించి, పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలను పరిష్కరించాలని రెవెన్యూ అధికారులకు సూచించారు. అనంతరం నిజాంపల్లి గ్రామంలోని 285, 286 పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణల కార్యక్రమం అమలు తీరును పరిశీలించారు. పోలింగ్ విధుల్లో ఉన్న బీఎల్‌ఓలు, బీఎల్‌ఓ సూపర్‌వైజర్లకు ఓటర్ల వివరాల డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని తెలిపారు. ఎలాంటి తప్పులు లేకుండా ఆన్‌లైన్ నమోదు ప్రక్రియను సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ హేమ, డిప్యూటీ తహసీల్దార్ శ్రీలత, బీఎల్‌ఓలు, తదితరులు పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ అశోక్ కుమార్


