ఏటూరునాగారం: మండల పరిధిలోని ఎలిశెట్టిపల్లి వాగు ఉధృతంగా ప్రవహించడంతో మండలంలోని చెల్పాక(రొయ్యూర్) ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు చాముండేశ్వరి, ఏఎన్‌ఎం ఆదిలక్ష్మి, ఆశ కార్యకర్త ధనలక్ష్మిలు వాగు దాటి వెళ్లి వైద్యం అందించారు. ఈ మేరకు మంగళవారం ఎలిశెట్టిపల్లిలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి 45 మంది రోగులకు పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. ఈ సందర్భంగా పీహెచ్‌సీ వైద్యురాలు చాముండేశ్వరి మాట్లాడుతూ వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజలకు సూచనలు చేసినట్లు తెలిపారు. అంతేకాకుండా లోతట్టు గ్రామాల ప్రజలకు కావాల్సిన మందులు మూడు నెలలకు సరిపడా నిల్వ చేసినట్లు వివరించారు. అలాగే ఎలిశెట్టిపల్లికి చెందిన గర్బిణి సౌజన్యను ముందస్తుగా ఏటూరునాగారం సామాజిక ఆస్పత్రికి 108లో తరలించినట్లు వెల్లడించారు. వర్షాకాలంలో వాగు ఉప్పొంగితే చికిత్స అందించడం ఇబ్బంది అవుతుందని ఆమె ప్రసవానికి రెండు వారాల సమయం ఉన్నా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆస్పత్రికి తరలించి ప్రసవం పొందేవరకు యోగ క్షేమాలు చూస్తామని వివరించారు.
45 మందికి మందుల పంపిణీ


