మొగుళ్లపల్లి: బ్యాంకులో తీసుకున్న అప్పు చెల్లించాలంటూ డీసీసీబీ అధికారులు రైతు భూమిలో ఎర్ర జెండాలు పాతారు. డీసీసీబీ పరకాల బ్రాంచ్ మేనేజర్ మన్యం స్వాతి తెలిపిన వివరాల ప్రకారం.. మొగుళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన రైతు గుర్రపు తిరుపతి రెడ్డి తన తల్లితండ్రుల సంబంధించిన 9 ఎకరాల భూమిని పరకాల డీసీసీబీ బ్రాంచ్‌లో తనఖా పెట్టి 2017లో రూ.10లక్షల రుణం తీసుకున్నాడు. పలుమార్లు రుణం చెల్లించాలని బ్యాంకు అధికారులు నోటీసులు జారీచేశారు. అయినా చెల్లించకపోవడంతో భూమిని వేలం వేస్తామని సూచిస్తూ రైతుకు గత నెలలో నోటీసులు జారీచేశారు. నోటీసుకు స్పందించకపోవడంతో సంబంధిత రుణ గ్రహీత రైతు భూమిలో సోమవారం ఎర్రజెండాలు పాతినట్లు మేనేజర్ స్వాతి తెలిపారు. ఈ నెల 16న సంబంధిత భూమిని బహిరంగ వేలం వేయనున్నట్లు చెప్పారు. మొగుళ్లపల్లి బ్రాంచ్ మేనేజర్ మేకల ప్రతిభ, ఫీల్డ్ ఆఫీసర్ గట్ల విక్రం బ్యాంకు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు..


