కాళేశ్వరం: జిల్లాలోని మహదేవపూర్ మండలంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన లక్ష్మీపంప్‌హౌస్(కన్నెపల్లి)ను బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు నేడు (ఆదివారం) సందర్శించనున్నారు. ఉదయం 8 గంటలకు హైదరాబాద్ నుంచి కారులో బయలుదేరుతారు. వరంగల్, పరకాల, భూపాలపల్లి, కాటారం మీదుగా మహదేవపూర్ మండలం కాళేశ్వ రం సమీపంలోని కన్నెపల్లికి మధ్యాహ్నం ఒంటి గంట వరకు చేరుకుంటారు. అనంతరం మీడియాతో మాట్లాడుతారని పార్టీ వర్గాలు తెలిపాయి. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు కేటీఆర్ వెంట రానున్నారు.
పంపులు లిఫ్ట్ చేయాలనే లక్ష్యం..
బీఆర్‌ఎస్ హయాంలో 2022 జూలై 14న భారీ వరదల కారణంగా లక్ష్మీ పంపుహౌస్ నీటమునిగిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి మరమ్మతులు కొనసాగుతున్నాయి. నీట మునిగి చెడిపోయిన ఐదు మోటార్లు రిపేర్లు కూడా చేశారు. 2023, అక్టోబర్ 21న మేడిగడ్డ బరాజ్‌లో 20 పియర్ కుంగి, వంతెనకు పగుళ్లు తేలిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఎన్‌డీఎస్‌ఏ సూచనలతో ప్రభుత్వం నీటిని నిలపడం లేదు. రెండుసార్లు సీఎం రేవంత్‌రెడ్డి బరాజ్‌ను పరీక్షించి పరీక్షల పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు. 2024, జూ లై 26న మొదటిసారి బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మేడిగడ్డ బ్యారేజీ, లక్ష్మీపంపుహౌస్‌లను సందర్శించి ప్రభుత్వ వైఖరిని నిలదీశారు. పంపులు నడిపి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. గతేడాది ఆగస్టు 25న మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ ఆధ్వర్యంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో కలిసి పంపుహౌస్‌ను ముట్టడించారు. పోలీసులు అడ్డుకొని నచ్చజెప్పి పంపారు. అప్పటి నుంచి ప్రభుత్వం ఎన్‌డీఎస్‌ఏ సూచనలతో పలు రకాల మరమ్మతులు, జియోఫిజికల్, జియోటెక్నికల్, జీపీటీ ఇతర పరీక్షలు చేపట్టింది. పరీక్షలు తుది దశకు చేరుకున్నాయి. గత నెలలో ఇరిగేషన్‌శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రాష్ట్ర ఇరిగేషన్ కో ఆర్డినేషన్ కమిటీ చైర్మన్ పరీక్షిత్ మెహ్రాతో కలిసి పర్యటించి పరీక్షలు పూర్తి చేసి వచ్చే ఏడాది జూన్‌లో నీరు అందించే కార్యక్రమం చేపడుతామని ప్ర కటించారు. ప్రస్తుతం వర్షాభావ పరిస్థితులు, మేడిగడ్డ బరాజ్ పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో కన్నెపల్లి వద్ద గోదావరికి అడ్డంగా కట్ట నిర్మాణం చేసి నీటి ని నిలిపి పంపులు ద్వారా ఎత్తిపోయాలనే డిమాండ్‌తో బీఆర్‌ఎస్ బృందంతో కలిసి కేటీఆర్ టూర్ ప్లాన్ చేసినట్లు పార్టీనాయకులు పేర్కొంటున్నారు. కాగా, ప్రాజెక్టును రెండోసారి పరిశీలించడానికి రానుండడంతో పార్టీ నాయకులు, కార్యకర్తల్లో నయా జోష్ కనిపిస్తుందని చర్చ.
ప్రభుత్వం కళ్లు తెరవాలి
ఆయనతోపాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, మాజీ ఎంపీ, ఎమ్మెల్యేలు
లక్ష్మీపంప్‌హౌస్ పంపులు లిఫ్ట్ చేయాలనే లక్ష్యంతో పర్యటన
కన్నెపల్లి పంపుహౌస్, పరిసరాలను శనివారం మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు సందర్శించి కేటీఆర్ పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో లక్ష్మీపంపుహౌస్‌లో మోటార్లు ఆన్ చేసి రైతాంగానికి నీరందించాలని, ఇకనైనా సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబులు కళ్లు తెరవాలని డిమాండ్ చేశారు.


