భూపాలపల్లి అర్బన్: జిల్లాలో నిబంధనలు అతిక్రమిస్తే ప్రైవేట్ ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ చల్లా మధుసూదన్ హెచ్చరించారు. జిల్లాకేంద్రంలోని పలు ప్రైవేట్ ఆస్పత్రులను డీఎంహెచ్‌ఓ డాక్టర్ మధుసూదన్ గురువారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మేద మల్టీ స్పెషాలిటీ, సాయిరత్న హాస్పిటల్‌లను పరిశీలించారు. ఆస్పత్రుల్లో ఫైర్ సేఫ్టీ అనుమతులు, కాలుష్య నియంత్రణ మండలి ధ్రువపత్రాలు, బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణకు సంబంధించిన రికార్డులు, రోగులకు అందుబాటులో ఉంచాల్సిన ధరల పట్టికలు, ఇతర చట్టబద్ధ పత్రాలను తనిఖీ చేశారు. అల్ట్రాసౌండ్ యంత్రాలకు సంబంధించిన రికార్డులు, కేసు షీట్లు పరిశీలించి సంబంధిత నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఆస్పత్రుల్లో నార్మల్ డెలివరీలను ప్రోత్సహించే దిశగా వైద్యులు ప్రత్యేకంగా కృషి చేయాలని ఆదేశించారు. తనిఖీల సందర్భంగా ఆస్పత్రి యాజమాన్యాలకు అన్ని అనుమతులు, ధ్రువపత్రాలను ఎప్పటికప్పుడు నవీకరించుకోవడంతో పాటు రోగులకు నాణ్యమైన, పారదర్శక వైద్యసేవలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ శ్రీదేవి, ఇన్‌చార్జ్ డెమో శ్రీదేవి పాల్గొన్నారు.
డీఎంహెచ్‌ఓ డాక్టర్ మధుసూదన్


