భక్తులకు ఇబ్బందులు కలగొద్దు
కాళేశ్వరం: కాళ్వేరంలో జరుగుతున్న సరస్వతి పుష్కరాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆయా శాఖల అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాహుల్‌శర్మ అధికారులను అదేశించారు. స్టాళ్లు, టెంట్‌సిటీ, సరస్వతి ఘాట్ వద్ద భక్తులను పుష్కర ఏర్పాట్లు, సౌకర్యాలు, మరుగుదొడ్లు, షవర్స్, ఘాట్స్, వైద్యశిబిరాలు, చలివేంద్రంను అధికారులతో కలిసి కలెక్టర్ శుక్రవారం పరిశీలించారు. కాలినడకన తిరుగుతూ సౌకర్యాల ఏర్పాట్లపై భక్తులతో ఆరాతీశారు. ఈ సందర్భంగా జైళ్ల శాఖ ఆధ్వర్యంలో ఖైదీలు తయారుచేసిన హ్యాండ్ మేడ్ వస్తువుల స్టాల్‌ను కలెక్టర్ ప్రారంభించారు. వివిధ స్టాళ్లు పరిశీలించి వ్యాపారాల గురించి అడిగి తెలుసుకున్నారు. చలివేంద్రాలలో తాగునీటి సరఫరాను పరిశీలించారు. త్రివేణి సంగమం వద్ద భక్తులకు తాగునీటి సరఫరాకు చలివేంద్రం ఏర్పాటుచేయాలని తక్షణమే వాకీటాకీ ద్వారా ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈని ఆదేశించారు. ఈ సందర్భంగా భక్తుల అభిప్రాయాలను తెలుసుకొని అధికారులకు తగిన సూచనలు చేశారు. అనంతరం కలెక్టర్ రాహుల్‌శర్మ మాట్లాడుతూ త్రివేణి సంగమంలో భక్తులు స్నానాలకు వెళ్లే మార్గంలో పిండ ప్రదానం కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, దానివల్ల భక్తులు వెళ్లడానికి ఇబ్బందులు పడుతున్నారన్నారు. భక్తుల సౌకర్యార్థం ఏర్పాటుచేసిన మార్గంలో పిండప్రదానం కార్యక్రమాలు నిర్వహించొద్దని సూచించారు. పిండ ప్రదాన నిర్వహణకు కేటాయించిన ప్రాంతంలో మాత్రమే పిండ ప్రదానాలు చేయాలని సూచించారు. వ్యర్థాలు గ్రామ పంచాయతీ వారు ఏర్పాటుచేసిన డస్ట్ బిన్లలో వేయాలని, త్రివేణి సంగమంలో వేయొద్దని చెప్పారు. భక్తులు నది పవిత్రను కాపాడాలని సూచించారు. జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సరస్వతి ఘాట్ వద్ద ఏర్పాటుచేసిన సెల్ఫీ స్టాల్‌లో భక్తులతో కలిసి సరదాగా ఫొటోలు దిగారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్, పరిశ్రమల శాఖ జీఎం సిద్ధార్థ, డీఆర్‌డీఓ నరేష్, డీటీ కృష్ణ పాల్గొన్నారు.
కలెక్టర్ రాహుల్ శర్మ


