నిబంధనలకు అనుగుణంగా ఎరువుల విక్రయం
● జిల్లా వ్యవసాయశాఖ అధికారి బాబురావు
కాటారం: ఫర్టిలైజర్ దుకాణాల నిర్వాహకులు నిబంధనలకు అనుగుణంగా ఎరువులు విక్రయించాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారి బాబురావు అన్నారు. మండలకేంద్రంలోని ఎరువుల దుకాణాలు, డీలర్ అవుట్‌లెట్లను మహదేవపూర్ ఏడీఏ శ్రీపాల్‌తో కలిసి తనిఖీ చేశారు. కేంద్రాల్లో అందుబాటులో ఉన్న యూరియా నిల్వలను ఫైవ్స్ యాప్ ద్వారా ధృవీకరించారు. స్టాక్ రిజిస్టర్లు, విక్రయ వివరాలు, బిల్లింగ్ ప్రక్రియలను పరిశీలించారు. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన మేరకు యూరియా సరఫరా నిరంతరం కొనసాగుతుందని పేర్కొన్నారు. అధిక ధరలకు ఎరువుల విక్రయాలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఓ పూర్ణిమ, ఏఈఓలు పాల్గొన్నారు.


