అంగడి అంగడి..
భూపాలపల్లి సంతలో వసతులు కరువు
భూపాలపల్లి అర్బన్: జిల్లాకేంద్రంలో సంత నిర్మాణం కోసం పదేళ్ల క్రితం చేసిన ప్రతిపాదనలు ఇప్పటికీ అమలుకు నోచుకోవడం లేదు. పాలకులు మారినా సంత నిర్మాణం మాత్రం కావడం లేదు. శాశ్వత స్థలం కేటాయించి సంతలో సౌకర్యాలు కల్పించాల్సి ఉండగా అధికారులు, పాలకులు పట్టించుకోవడం లేదు.
చుట్టుపక్కల గ్రామాల నుంచి సైతం..
భూపాలపల్లి పట్టణం సుభాష్‌కాలనీలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల వెనకాల గ్రౌండ్‌లో ప్రతీ గురువారం వారాంతపు సంత సాగుతోంది. పట్టణ ప్రజలతో పాటు పరిసర, సమీప గ్రామాల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో తరలివస్తారు. కూరగాయలు, అల్లం, వెల్లుల్లి, మాసాలాలు, పండ్ల వ్యాపారం జోరుగా సాగుతోంది. సంతలో సరైన స్థలం, వసతులు లేక రోడ్లపైన వ్యాపారాలు నిర్వహించడంతో అటు అమ్మకందారులు, వినియోగదారులకు తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు. మున్సిపల్ అఽధికారులు రూ.లక్షల్లో ఆదాయం పొందుతున్నా సౌకర్యాలు కల్పించడంలో మాత్రం శ్రద్ధ చూపడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. వ్యాపారులు, కొనుగోలుదారులకు కనీసం తాగునీటి సౌకర్యం లేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. దీంతో వ్యాపారులు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మరుగుదొడ్లు కూడా ఏర్పాటు చేయడం లేదు. మహిళల ఇబ్బందులు చెప్పుకోలేకుండా ఉన్నాయి. గంప చిట్టి పేరుతో వ్యాపారుల నుంచి రూ.30 నుంచి రూ.50 వరకు వసూలు చేస్తున్నారు.
రోడ్లపైనే అమ్మకాలు..
పట్టణంలో దాదాపు 30వేల కుటుంబాలు, సమీప గ్రామాల ప్రజలు ఈ వారాంతపు సంతపైనే ఆధారపడి ఉంటారు. ప్రతీ వారం జరిగే ఈ సంతలో సౌకర్యాలు కల్పించడంలో అధికారులు పూర్తిగా విఫలమైనట్లు కనిపిస్తోంది. సంతలో అమ్మకందారులకు సరైన వసతులు లేకపోవడంతో రోడ్లపైనే విక్రయాలు జరపడంతో రోడ్లన్నీ జనంతో నిండిపోతున్నాయి. అంబేడ్కర్ సెంటర్ నుంచి సుభాష్‌కాలనీ వైపు కేటీకే 1వ గని, ఓసీపీ–2లకు బొగ్గు, ఇసుక లారీలు వెళ్లే ప్రధాన రహదారి కావడంతో వాహనదారులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. పార్కింగ్ స్థలం లేకపోవడంతో రోడ్డుకు ఇరువైపులా ద్విచక్ర వాహనాలను పార్కింగ్ చేయాల్సి వస్తుంది.
భయపెడుతున్న పశువులు
సంతలో పశువులు విచ్చలవిడిగా తిరుగుతున్నాయి. కూరగాయలను తినడమే కాకుండా వ్యాపారులు, కొనుగోలుదారులను పొడుస్తున్నారు. వెనకాల నుంచి వచ్చి చేతిలో సంచులను నోటితో లాగి అందులో ఉన్నవాటిని సైతం తింటున్నాయి. పశువులు సంత లోపలకి రాకుండా చూడాల్సిన మున్సిపల్ సిబ్బంది అటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
అంగడిలో ప్రతీ వారం లక్షల్లో వ్యాపారం నడుస్తోంది. కానీ సమస్యలు మాత్రం తీరడం లేదు. గ్రామాల్లో జరిగే అంగడి కూడా ఇంత అధ్వానంగా ఉండదు. అధికారులు స్పందించి వినియోగారులకు, అమ్మకందారులకు కావాల్సిన సౌకర్యాలు కల్పించాలి. సంతకు రావాలంటేనే భయమేస్తోంది. మహిళలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో రావాల్సి వస్తోంది. సంతలో పశువులు, మేకలు తిరుగుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నాయి.
– మద్దెల విజయ్, భూపాలపల్లి
కొనుగోలు, అమ్మకందారులకు ఇక్కట్లు
పట్టించుకోని మున్సిపల్ అధికారులు
అంగడి అంగడి..


