మోదుగు విస్తరి! | - | Sakshi
Sakshi News home page

మోదుగు విస్తరి!

Nov 22 2026 2:35 AM | Updated on Nov 22 2026 2:35 AM

ఆరోగ్య

సిరి..

జనగామ: పచ్చనాకు భోజనం.. పచ్చనైన జీవితం అన్నది మన పెద్దల మాట. పచ్చని ప్రకృతి ఒడిలో మోదుగాకుల విస్తరిలో భోజనం చేయడం ఒకప్పుడు పల్లె సంస్కృతిలో అంతర్భాగం. ఇంటికి బంధువులు వచ్చినా, పెళ్లిళ్లు, శుభకార్యాలు, పండుగలు, దేవుడి కల్యాణాలు జరిగినా మోదుగాకుల విస్తర్లకే ప్రాధాన్యం ఉండేది. ఈ సహజ సంపద నేడు కనుమరుగవుతోంది. వాటి స్థానాన్ని ప్లాస్టిక్‌ విస్తర్లు ఆక్రమించడంతో సంప్రదాయంతోపాటు వందల కుటుంబాల ఉపాధి దూరమైంది.

జనగామ విస్తర్లకు భలే గిరాకీ

మోదుగాకులతో విస్తర్ల తయారీలో జిల్లాకు ప్రత్యేక గుర్తింపు ఉండేది. ఇక్కడ తయారైన వాటిని నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాలతో పాటు హైదరాబాద్‌, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌ తదితర ప్రాంతాలకు ఎగుమతి చేసేవారు. రోజూ సుమారు 5 వేల నుంచి 8 వేల కట్టల వరకు ఇతర ప్రాంతాలకు తరలించేవారు. ఒక్కో కట్టలో 100 విస్తర్లు ఉండేవి. అప్పట్లో రూ.5తో ప్రారంభమైన కట్ట ధర కాలక్రమంలో రూ.15 నుంచి రూ.20 వరకు పలికేది. జిల్లాలో వందలాది కుటుంబాలు ఈ వృత్తిపై ఆధారపడి జీవనం సాగించేవి. ప్రస్తుతం మోదుగు ఆకు కరువైంది. అడపాదడపా దొరికే ఆకులతో కుట్టిన విస్తరి కట్ట (100 పీసులు)కు తయారీదారుల వద్ద రూ.250 ధర పలుకుతుండగా, మార్కెట్‌లో 25 పీసుల చొప్పున విడదీసి రూ.150కి ఒకటి అమ్ముతున్నారు. ఒకప్పుడు ఇంటింటా కనిపించిన ఈ వృత్తి నేడు దాదాపు కనుమరుగైంది.

పర్యావరణ పరిరక్షణ.. ఆరోగ్యానికి మేలు..

మోదుగాకుల విస్తరిలో భోజనం చేయడమంటే ప్రకృతితో మమేకమవడం, ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే. ఆకు అయితే తిన్నవెంటనే పెరట్లో వేస్తే కంపోస్ట్‌గా మారుతుంది. పర్యావరణ పరిరక్షణకు తోడ్పడుతుంది. ప్రకృతికి ఎటువంటి హానికలగదు. అదే ప్లాస్టిక్‌ ప్లేట్‌ అయితే వేడిపదార్థాలు వేసిన వెంటనే హానికర రసాయనాలు, వాయువులు వెలువడి ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. ఈ సంపదను కాపాడుకోవాలంటే మోదుగు మొక్కల పెంపకాన్ని ప్రోత్సహించాలి. మహిళా సంఘాల ద్వారా ఈ వృత్తికి మళ్లీ జీవం పోయాలి.

అభివృద్ధి పరుగులో అంతరించి పోతున్న మోదుగాకు

నాడు రోజుకు 8 వేల కట్టల ఎగుమతి

వందల కుటుంబాలకు ఉపాధినిచ్చిన వృత్తికి కాలం చెల్లేనా?

వాటిస్థానాన్ని ఆక్రమించిన ప్లాస్టిక్‌ ప్లేట్లు

కనుమరుగైన మోదుగు వనాలు

రెండు దశాబ్ధాలుగా పరిస్థితులు మారిపోయాయి. రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లు, రోడ్ల విస్తరణ, పట్టణాలు, మండల కేంద్రాలు, గ్రామాల అభివృద్ధి పేరుతో అడవులు, సహజ వృక్ష సంపద తగ్గిపోతున్నాయి. మోదుగు చెట్లు కూడా క్రమంగా కనుమరుగయ్యాయి. దీంతో విస్తర్ల తయారీకి అవసరమైన ఆకులు దొరకడం కష్టమైంది. ఫలితంగా ప్లాస్టిక్‌ విస్తర్ల వినియోగం పెరిగిపోయింది. అదేవిధంగా ప్రస్తుతం చెరకు పిప్పితో తయారు చేసిన విస్తర్లు, బయోడీగ్రేడబుల్‌ పదార్థాలతో పాటు తునికాకులతో తయారు చేసిన విస్తర్లు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. ఒక్కో ప్లేటు ధర రూ.8 నుంచి రూ.14 లేదా అంతకంటే ఎక్కువగా ఉండడంతో సామాన్య కుటుంబాలు కొనుగోలు చేయలేకపోతున్నాయి. దీంతో తక్కువ ధరకు వచ్చే ప్లాస్టిక్‌ ప్లేట్లను వినియోగిస్తున్నారు.

విస్తరాకు కట్టలకు డిమాండ్‌

మోదుగు ఆకులతో తయారు చేసిన ఇస్తారాకు కట్టలకు ప్రస్తుతం మార్కెట్‌లో డిమాండ్‌ ఉంది. ఒక కట్ట ధర రూ.250కి విక్రయిస్తున్నాం. వేసవిలో మోదుగు ఆకులను సేకరించి ఆరబెడతాం. వర్షాకాలం ప్రారంభంలో విస్తరాకులను తయారు చేస్తాం. గతంలో ఒక్క కట్టకు రూ.80 నుంచి రూ.100 మాత్రమే చెల్లించేవారు. డిమాండ్‌ పెరగడంతో హోల్‌సేల్‌ వ్యాపారులకు రూ.250కి ఇస్తున్నాం.

– కట్కూరి స్వప్న, తయారీదారురాలు, బచ్చన్నపేట

మోదుగాకు దొరకడం లేదు

మోదుగు ఆకు సేకరించి విస్తరాకులను తయారు చేసి అదనపు ఆదాయం సమకూర్చుకున్నాం. 100 విస్తరాకులు ఉన్న కట్టకు రూ.100కు అమ్ముకునేటోళ్లం. ఇప్పుడు మోదుగు ఆకు దొరకడం లేదు. ఈ వ్యాపారం పూర్తిగా నిలిచిపోయింది. ప్లాస్టిక్‌ ప్లేట్లను కొంటున్నాం.

– చవనబోయిన సమ్మక్క, జఫర్‌గఢ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement