అల్వార్‌బండ.. ఉద్యోగుల తండా | - | Sakshi
Sakshi News home page

అల్వార్‌బండ.. ఉద్యోగుల తండా

Nov 22 2026 2:35 AM | Updated on Nov 22 2026 2:35 AM

సుమారు 70 మందికిపైగా ప్రభుత్వ ఉద్యోగులే

● తల్లిదండ్రుల ప్రోత్సాహం, రిజర్వేషన్లను అందిపుచ్చుకొని ఎదిగిన గిరిజనులు

● ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్న

తండావాసులు

జఫర్‌గఢ్‌: ఒకప్పుడు తండాలంటేనే అభివృద్ధికి అమడదూరంలో ఉండేవి. వ్యవసాయ పనులు లేక ఆర్థిక ఇబ్బందులతో గిరిజనులు చదువులో వెనుకబడి ఉండేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారింది. రిజర్వేషన్లకు తోడుగా తల్లి దండ్రుల ప్రోత్సాహంతో కష్టపడి చద వి ఉన్నత విద్యనభ్యసించి ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ప్రైవేట్‌ రంగాల్లో కూడా ఉద్యోగాలు సాధించి అల్వార్‌బండాతండా వాసులు ఆదర్శంగా నిలుస్తున్నారు. జఫర్‌గఢ్‌ మండలంలోని అల్వార్‌బండతండా (శంకర్‌తండా)లో సుమారు 550 మంది జనాభా ఉండగా ఇందులో 391 మంది ఓటర్లు ఉన్నారు. తండాలో వ్యవసాయ పనులు చేస్తూ పిల్లల చదువులపై ప్రత్యేక శ్రద్ధ చూపారు. తల్లిదండ్రుల కష్టానికి తగ్గట్టుగా పిల్లలు ఉన్నత చదువులు చదివారు. పీజీలు, డిగ్రీలు, బీటెక్‌లు, వృత్తి విద్య కోర్సుల్లో విద్యనభ్యసించి అందివచ్చిన రిజర్వేషన్లను ఉపయోగించుకోని పలు రంగాల్లో కొలువులను సాధించారు. ప్రభుత్వ రంగంతో పాటు ప్రైవేట్‌ రంగాల్లో కూడా ఉద్యోగా లు చేస్తూ స్థిరపడిన వారు అనేక మంది ఉన్నారు. మండలంలో 15 గిరిజన తండాలు ఉన్నప్పటికీ ఈ తండా నుంచి ఎక్కువ సంఖ్యలో ఉద్యోగాలు చేస్తున్నారు. ఇందులో ప్రతీ రెండు కుటుంబాల నుంచి ఒకరు చొప్పున ప్రభుత్వం ఉద్యోగం, ప్రైవేట్‌ ఉద్యోగిగా పని చేస్తుండడం గమనార్హం.

ఉన్నత ఉద్యోగాలు చేస్తున్నవారు..

తండా నుంచి ఉన్నత ఉద్యోగాలు చేస్తున్న వారిలో బానోత్‌ యఖిల్‌చంద్‌ ఐఆర్‌ఎస్‌, లకా వత్‌ అరుణ్‌నాయక్‌ కస్టమ్స్‌ ఆఫీసర్‌, డీఆర్‌డీఓ, లకావత్‌ శ్రీనివాస్‌నాయక్‌ సైంటిస్ట్‌, బానోత్‌ చి న్న నాయక్‌ వైద్యుడు, బానోత్‌ అనేష్‌నాయక్‌ కెనరాబ్యాంక్‌ ఆర్‌ఓ, బి.ప్రవీణ్‌నాయక్‌ ఎన్‌ఎఫ్‌సీ, లకావత్‌ శేషునాయక్‌ డీఆర్‌డీఓ అధికారిగా పని చేస్తున్నారు. రిటైర్డ్‌ అయిన వారిలో బానోత్‌ వెంకట్రాంనాయక్‌ ఆర్‌జేడీ, లక్ష్మణ్‌నాయక్‌ ఎస్‌బీఐ ఆర్‌ఓ, దేవిసింగ్‌నాయక్‌, రాంధాన్‌, లకావత్‌ లచ్చిరాంనాయక్‌ బ్యాంక్‌ మేనేజర్లు, రిటైర్డ్‌ ప్రిన్సిపాల్‌గా బి.రామ్‌కిషన్‌నాయక్‌లు ఉన్నారు. అలాగే రైల్వే, బీఎస్‌ఎన్‌ఎల్‌, దూరదర్శన్‌, ఆర్టీసీ, ఉపాధ్యాయులు, సాఫ్ట్‌వేర్‌, పోలీస్‌, జైళ్లశాఖలో మరికొంత మంది పని చేస్తున్నారు. విదేశాల్లో సైతం నలుగురు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement