27న గ్రామసభలు, వార్డుసభలు నిర్వహించాలి | - | Sakshi
Sakshi News home page

27న గ్రామసభలు, వార్డుసభలు నిర్వహించాలి

Aug 25 2026 12:57 AM | Updated on Aug 25 2026 12:57 AM

జనగామ రూరల్‌: ఈనెల 27న రాష్ట్రంలోని అన్ని పోలింగ్‌ కేంద్రాల పరిధిలో గ్రామ సభలు, వార్డు సభలు నిర్వహించాలని రాష్ట్ర ప్రధా న ఎన్నికల అధికారి సి.సుదర్శన్‌రెడ్డి జిల్లాల ఎన్నికల అధికారులను ఆదేశించారు. సోమవారం, ఎస్‌ఐఆర్‌ కార్యక్రమంపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్‌ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లాల ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. కలెక్టరేట్‌ నుంచి కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా హాజరయ్యారు. ఈసందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో సంబంధిత గ్రామ పంచాయతీ భవనంలో, పట్టణ ప్రాంతాల్లో సంబంధిత పోలింగ్‌ కేంద్రంలో సభలు నిర్వహించాలని తెలిపారు. సభల వద్ద ఫారం–6, ఫారం–7, ఫారం–8, తదితర అవసరమైన ఫారాలను సిద్ధంగా ఉంచాలని తెలిపారు. ప్రతీ నోటీసులో విచారణ తేదీ, విచారణ జరిగే ప్రదే శం, సమయాన్ని స్పష్టంగా పేర్కొనాలని సూచించారు. కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా మాట్లాడుతూ.. జిల్లాలో ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో భాగంగా నోటీసుల జనరేషన్‌ ప్రక్రియను వేగవంతం చేసి, పూర్తి చేస్తున్నామని తెలిపారు. ఆర్డీఓలు గోపీరాం, కిరణ్‌ ప్రకాష్‌, ఎన్నికల సూపరింటెండెంట్‌ శ్రీధర్‌ పాల్గొన్నారు.

అధ్యాపక పోస్టుల భర్తీకి ఎంపిక పరీక్ష

జనగామ రూరల్‌: జిల్లాలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్రొఫెసర్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి సోమవారం కలెక్టర్‌ కార్యాలయంలోని మెయిన్‌ కాన్ఫరెన్స్‌ హాల్లో ఎంపిక పరీక్షను నిర్వహించారు. ప్రభుత్వ వైద్య కళాశాలలో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్‌ – 6, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ – 12, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ – 7 పోస్టులు కలిపి మొత్తం 25 ఒప్పంద ప్రాతిపదికన పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులు ఆహ్వానించగా, మొ త్తం 13 దరఖాస్తులు రాగా 10 మంది అభ్యర్థులు ఎంపిక పరీక్ష రాశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా పరీక్ష ప్రక్రియను పర్యవేక్షించారు. ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్‌ డా.నాగమణి, జిల్లా ఉపాధి కల్పన అధికారి ఆర్‌.కుమారస్వామి పాల్గొన్నారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అందించాలి

జనగామ రూరల్‌: ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అందించి విద్యార్థులను ఆదుకోవాలని బీజేపీ జిల్లా అద్యక్షుడు సౌడ రమేశ్‌ డిమాండ్‌ చేశారు. సోమవారం బీజేపీ కార్యాలయంలో ఎస్‌ఐఆర్‌ కమిటీ జిల్లా కన్వీనర్‌ బొజ్జపల్లి సుభాష్‌ అధ్యక్షతన ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ..రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 40 లక్షల మంది విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అందక చదువుకు దూరమయ్యే పరిస్థితి నెలకొందన్నారు. ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్‌ ప్రభుత్వం విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అందించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు చేస్తున్న దీక్షను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో విడుదల రమేశ్‌, బల్ల శ్రీనివాస్‌,ఐలోని అంజిరెడ్డి, పెరుమళ్ళ అమరేందర్‌ రెడ్డి, దుర్గాప్రసాద్‌, సట్ల వెంకటరమణ, బైరుపాక కుమార్‌, పుప్పాల వేణు, గంటే ఉపేందర్‌, జగదీష్‌, సందీప్‌ తదితరులు పాల్గొన్నారు.

గుండెపోటుతో ఇంటర్‌ విద్యార్థిని మృతి

చిల్పూరు: ఇంటర్‌ ఫస్టియర్‌ విద్యార్థిని నిద్రలోనే గుండెపోటుతో చనిపోయింది. ఈ ఘటన మండలంలోని వంగాలపల్లి గ్రామంలో ఆదివారం రాత్రి జరిగింది. గ్రామానికి చెందిన గుగులోతు వసంత–రమేశ్‌ల కూతురు పల్లవి(16) జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాటారం ట్రైబల్‌ వెల్ఫేర్‌ కళాశాలలో ఇంటర్‌ ప్రథమ సంవత్సరం చదువుతోంది. మంగళవారం గ్రామంలో ఓ విందు కార్యక్రమంతోపాటు రాఖీ పండగ కోసం పల్లవిని వారం రోజుల సెలవుతో తండ్రి రమేశ్‌ ఆదివారం సాయంత్రం ఇంటికి తీసుకొచ్చాడు. రాత్రి 10 గంటల వరకు కుటుంబ సభ్యులతో గడిపిన పల్లవి నిద్రపోయింది. సోమవారం ఉదయం 8 అవుతున్నా నిద్రలేవకపోవడంతో తల్లి వసంత లేపే ప్రయత్నం చేయగా కదలిక లేకపోవడంతో అనుమానంతో చుట్టుపక్కల వారిని పిలవడంతోపాటు 108కి సమాచారం ఇచ్చారు. వారు వచ్చి పరీక్షించగా అప్పటికే మృతిచెందిందని తెలిపారు. గుండెపోటుతో చనిపోయి ఉంటుందని సిబ్బంది చెప్పినట్లు కుటుంబ సభ్యులు రోదిస్తూ చెప్పారు. వారం రోజులు ఇంట్లో అందరితో కలిసి సంతోషంగా ఉంటుందనుకున్న కూతురు తమను శోకసముద్రంలో ఉంచి వెళ్లిందని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement