కాజీపేట అర్బన్ : ‘నా దారి రహదారి.. బెటర్ డోంట్ కమిన్ టు మై వే’ అనే సినిమా డైలాగ్‌ను తలపిస్తూ ‘మెరుగైన రహదారుల నిర్మాణానికి అవసరమైన డేటా అందించడమే నా దారి’ అంటూ ఆధునిక టెక్నాలజీతో రూపొందించిన సప్తగాన్ వాహనం ఇటీవల నిట్ వరంగల్‌కు చేరుకుంది. భారతదేశంలోనే తొలిసారిగా హరియాణా, గురుగ్రామ్‌లో అడ్వాన్స్ టెక్నాలజీ, రూ.30 కోట్ల వ్యయంతో దీన్ని రూపొందించారు.
ఆధునిక టెక్నాలజీతో రూపకల్పన
మెరుగైన రహదారుల నిర్మాణంలో కీలకం
నిట్ వరంగల్‌తో ఎంఓయూ.. ఇటీవల పనితీరును పరిశీలించిన విద్యార్థులు
ట్రాన్స్‌పోర్ట్ ఇంజనీరింగ్ విద్యార్థుల పరిశోధనకు ఉపయుక్తం
మెరుగైన రవాణా సౌకర్యం, రహదారుల నిర్మాణాల్లో లోపాన్ని పసిగట్టడం, ట్రాన్స్‌పోర్ట్ ఇంజనీరింగ్ పరిశోధనలకు దేశవ్యాప్తంగా ఈ సప్తగాన్ ప్రయాణం చేస్తోంది. ఇందులో మన ట్రాన్స్‌పోర్ట్ ఇంజనీరింగ్ విద్యార్థులను భాగస్వాములను చేసేందుకు ఇటీవల సప్తగాన్ ఏషియా సంస్థ నిర్వాహకులు, నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీతో ఎంఓయూ కుదుర్చుకున్నారు. భారత ప్రభుత్వం వికసిత్ భారత్, మేక్ ఇన్ ఇండియా విజన్‌లో భాగంగా ఈ వాహనాన్ని ఇక్కడికి తీసుకురాగా, వాహన పనితీరును విద్యార్థులు ప్రత్యక్షంగా వీక్షించారు. వాహన పనితీరుపై పూర్తిస్థాయిలో అవగాహన ఏర్పర్చుకున్నారు.


