రఘునాథపల్లి: మండలంలోని జాఫర్‌గూడెంలో మద్యం విక్రయాలను నిషేధిస్తున్నట్లు గ్రామసభలో తీర్మానం చేశారు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా విచ్చలవిడిగా బెల్ట్‌షాపుల నిర్వహణతో కుటుంబాలు చిద్రమవుతున్నాయని మహిళలు, యువకులు.. పంచాయతీ పాలకవర్గం దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ఈ నెల 25 నుంచి గ్రామంలో సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేస్తున్నట్లు సర్పంచ్ శాగ సురేష్ బుధవారం తెలిపారు. గ్రామంలో మద్య నిషేధం అమలుకు సహకరించాలని పోలీసులు, ఎకై ్సజ్ అధికారులకు వినతి పత్రాలు అందజేసినట్లు పేర్కొన్నారు. ఎవరైనా గ్రామంలో మద్యం విక్రయిస్తే అధికారుల దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వ పథకాలు నిలిపివేయనున్నట్లు ఆయ న పేర్కొన్నారు. గ్రామంలో మద్య నిషేధం అమలు చేయడంపై మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ కావ టి రవి, పంచాయతీ కార్యదర్శి బండ మధు, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
ఏఐటీయూసీ మహాసభను జయప్రదం చేయాలి
జనగామ రూరల్: ఏఐటీయూసీ రాష్ట్ర 4వ మహాసభ జయప్రదం చేయాలని యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు సీహెచ్ రాజారెడ్డి అన్నారు. పట్టణంలోని గబ్బెట గోపాల్ రెడ్డి భవనంలో మోటే శ్రీశైలం అధ్యక్షతన బుధవారం నిర్వహించిన జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో పాలకులు అవలంభిస్తున్న కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలు, లేబర్ కోడ్స్ కార్మికుల హక్కులపై తీవ్రమైన దాడికి గురి చేస్తున్నాయన్నారు. ఐక్యతతో లేబర్ కోడ్స్‌పై దేశవ్యాప్తంగా ప్రతిఘించాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం మహాసభల వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో నాయకులు ఆకుల శ్రీనివాస్, ఆదిసాయన్న, చొప్పరి సోమయ్య, యాకూబ్, సదానందం, నాగరాజు, సుశీల, పోచమ్మ, ఐలయ్య, సిద్దిరాములు, యాకయ్య, లక్ష్మయ్య, తదితరులు పాల్గొన్నారు.
స్మార్ట్ కార్డుల్లో పలు తప్పులు
రఘునాథపల్లి: స్మార్ట్ రేషన్ కార్డులు తప్పుల తడకగా ఉన్నాయి. లబ్ధిదారుల పేర్లు మొదలు, గ్రామం, పిన్‌కోడ్ ఇలా చాలా తప్పులు దొర్లాయి. మండల కేంద్రంలో ఈ నెల 21న ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రారంభించిన ఈ కార్డుల ప్రక్రియ కొనసాగుతోంది. అయితే ఇందులోని మెజారిటీ కార్డులో అక్షర దోషాలు ఉంటున్నాయి. రఘునాథపల్లి మండలంలోని పలు గ్రామాల పేర్లు తప్పుగా ముద్రించారు. కంచనపల్లి, రఘునాథపల్లి తదితర గ్రామాల పేరు చివరన పల్లికి బదులు.. పల్లె అని ఉంది. పిన్‌కోడ్ 506244 బదులు.. 506143 గా ముద్రించారు. కార్డుపై పేరుతోపాటు ఆన్‌లైన్‌లో కుటుంబ సభ్యుల పేర్లలోనూ తప్పులు ఉన్నాయి. అయితే ప్రభుత్వ సంక్షేమ పథకాలకు రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకునే అవకాశం ఉండడంతో కార్డులపై ముద్రించిన వివరాలు తప్పుగా ఉండడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయమై వివరణ కోరేందుకు తహసీల్దార్ రాజేష్‌రెడ్డిని ఫోన్‌లో ప్రయత్నించగా.. స్పందించలేదు.
అథ్లెటిక్స్ పోటీలు ప్రారంభం
వరంగల్ స్పోర్ట్స్: తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హనుమకొండలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో రెండు రోజుల పాటు జరగనున్న 12వ రాష్ట్ర స్థాయి జూనియర్స్ అథ్లెటిక్స్ పోటీలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఈపోటీల్లో పాల్గొనేందుకు రాష్ట్రంలోని 33 జిల్లాలు, 4 అకాడమీలు, 3 క్రీడా పాఠశాలల నుంచి 1,600 మంది అథ్లెట్లు పాల్గొన్నట్లు నిర్వహణ కార్యదర్శి పగడాల వెంకటేశ్వర్‌రెడ్డి తెలిపారు. అండర్–14, 16, 18, 20 బాలబాలికలకు రెండు రోజుల పాటు 120 ఈవెంట్లలో పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందులో ప్రతిభ కనబర్చిన అథ్లెట్లను సెప్టెంబర్ 16, 17, 18 తేదీల్లో పాండిచ్చేరీలో జరగనున్న సౌత్‌జోన్ జూనియర్స్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ పోటీలకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్ చైర్మన్ వరదరాజేశ్వర్‌రావు ముఖ్య అతిథిగా హాజరై పోటీలు ప్రారంభించారు.


