జనగామ: మాదకద్రవ్యాల నిర్మూలనలో మహిళా సంఘాలు కీలక పాత్ర పోషించాలని, ప్రతీ మహిళ తన కుటుంబంతోపాటు గ్రామాలు, పట్టణాలను డ్రగ్స్ బారిన పడకుండా కాపాడే ‘సంఘమిత్ర’గా మారాలని వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత పిలుపునిచ్చారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మహిళా సంఘాల సభ్యులకు సంఘమిత్ర–మాదకద్రవ్యాల నిర్మూలనపై కలెక్టరేట్‌లో అవగాహన సదస్సు నిర్వహించారు. ముందుగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, డీసీపీ రాజమహేంద్ర నాయక్‌తో కలిసి కమిషనర్ శ్వేత.. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం సీపీ శ్వేత మాట్లాడుతూ.. తెలంగాణ అభివృద్ధిలో మహిళా సంఘాలు కీలకంగా పనిచేస్తున్నాయని, అదే స్ఫూర్తితో మాదకద్రవ్యాల నిర్మూలనకు సహకరించాలని కోరారు. పోలీసుల సంఖ్య పరిమితంగా ఉన్నందున మహిళా సంఘాల సహకారంతో అవగాహన కల్పించవచ్చన్నారు. గంజాయి విక్రయాలు, రవా ణా, వినియోగంపై సమాచారాన్ని 112కు ఫోన్ చేసి తెలియజేయాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని, అవసరమైతే బహుమతులు అందిస్తామని తెలిపారు.
డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చుదాం
జిల్లాలో సుమారు 1.25 లక్షల మంది మహిళా సంఘాల సభ్యులు ఉన్నారని, వారి ద్వారా డ్రగ్స్ వ్యతిరేక సందేశాన్ని ప్రతీ ఇంటికి తీసుకెళ్లాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పిలుపునిచ్చారు. మాదకద్రవ్యాల వల్ల కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందులు, గృహహింస, సామాజిక సమస్యలు పెరుగుతున్నాయని తెలిపారు. జనగామను మాదకద్రవ్య రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు అందరూ భాగస్వాములు కావాలని కోరారు. అనంతరం డీసీపీ రాజమహేంద్ర నాయక్ మాట్లాడుతూ.. డ్రగ్స్ మొదట సరదాగా ప్రారంభమై ప్రాణాంతక వ్యసనంగా మారుతుందని తెలిపారు. పిల్లల ప్రవర్తనలో ఆకస్మిక మార్పులు, ఆలస్యంగా ఇంటికి రావడం, కొత్త స్నేహాలు వంటి లక్షణాలను తల్లిదండ్రులు గమనించాలని సూచించారు. ఎన్‌డీపీఎస్ చట్టం–1985 ప్రకారం మాదకద్రవ్యాల విక్రయం, రవాణా, వినియోగం, నిల్వపై కఠిన శిక్షలు ఉంటాయని తెలిపారు. మాదకద్రవ్యాల దుష్ప్రభావాలు, చికిత్స, పునరావాసంపై సైకాలజిస్ట్ డాక్టర్ విజయక్రాంతి అవగాహన కల్పించారు. విద్యార్థులు నాటికలు, సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా డ్రగ్స్ వ్యతిరేక సందేశాన్ని అందించారు. అనంతరం డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో ఏసీపీలు భీం శర్మ, నర్సయ్య, ఏపీడీ నూరుద్దీన్, చాకలి ఐలమ్మ సమాఖ్య నాయకురాలు మమత తదితరులు పాల్గొన్నారు.
వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత
మాదకద్రవ్య రహిత జిల్లాగా మార్చుదాం
కలెక్టర్ సందీప్ కుమార్ ఝా


