లైసెన్సులు లేకుండానే అమ్మకాలు?
చర్యలు శూన్యం
ఆరోగ్యంపై ప్రభావం
జనగామ: జిల్లాలో వాటర్ ప్లాంట్ల నిర్వహణపై అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో తాగునీటి నాణ్యతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాకేంద్రంలోనే 100కు పైగా వాటర్ ప్లాంట్లు, 12 మండలాల పరిధిలో మరో 150కుపైగా ప్లాంట్లు ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లా కేంద్రంలో రోజుకు లక్ష లీటర్లకు పైగా, మండలాల్లో మరో లక్షన్నర లీటర్ల వరకు తాగునీటి విక్రయాలు జరుగుతున్నట్లు సమాచారం.
లైసెన్సులు.. సర్టిఫికెట్లు ఏవీ?
వాటర్ ప్లాంట్ల నిర్వహణకు ట్రేడ్ లైసెన్సు, నీటి నాణ్యతకు సంబంధించిన అనాలసిస్ సర్టిఫికెట్లు తప్పనిసరిగా ఉండాలి. నీటిని ఎలాంటి ప్రక్రియ ద్వారా శుద్ధి చేస్తున్నారు, ఎప్పటికప్పుడు యంత్రాలను శుభ్రం చేస్తున్నారా, నాణ్యత పరీక్షలు నిర్వహిస్తున్నారా? అనే అంశాలపై స్పష్టత కనిపించడం లేదు. నిబంధనల ప్రకారం నీటి అనాలసిస్ సర్టిఫికెట్‌ను మూడు నెలలకు ఒకసారి తీసుకుని సంబంధిత అధికారులకు సమర్పించాల్సి ఉన్నప్పటికీ, చాలా చోట్ల ఈ ప్రక్రియ అమలవుతోందా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది.
సింటెక్స్ డబ్బాల్లో అమ్మకాలు
వాటర్ ప్లాంట్లకే పరిమితం కాకుండా కిరాణా దుకాణాలు, షాపులు, ఇతర గృహాల వద్ద సింటెక్స్ డబ్బాలను ఏర్పాటు చేసి ప్లాంట్ల నుంచి నీటిని కొనుగోలు చేసి విక్రయిస్తున్నారు. ఈ డబ్బాలను ఎన్నిరోజులకు ఒకసారి శుభ్రం చేస్తున్నారు, వాటిలో నిల్వ చేసిన నీటిని ఎంతకాలం తర్వాత మార్చుతున్నారన్నది తెలియని పరిస్థితి. అపరిశుభ్రమైన కంటైనర్లలో నీటిని నిల్వ చేస్తే శుద్ధి చేసిన నీరు కూడా కలుషితమయ్యే అవకాశం ఉంది.
హోటళ్లు.. ఫంక్షన్ హాళ్లకు సరఫరా
హోటళ్లు, వ్యాపార సంస్థలు, ఫంక్షన్ హాళ్లు, సభలు, సమావేశాలు, శుభకార్యాలకు పెద్ద ఎత్తున వాటర్ క్యాన్లు సరఫరా అవుతున్నాయి. దీంతో ఒక ప్లాంట్‌లో నాణ్యత లోపిస్తే దాని ప్రభావం వందలాది మందిపై పడే అవకాశం ఉంది. దీనికి తోడు కూలింగ్ వాటర్, ప్యాకేజ్డ్ వాటర్ ప్యాకెట్ల తయారీ కూడా కొన్ని ప్రాంతాల్లో జరుగుతున్నట్లు సమాచారం. వీటి నాణ్యతపై కూడా పర్యవేక్షణ అవసరం.
మున్సిపల్ నీరే నాణ్యమైనదంటూ పరీక్షలు
జనగామ మున్సిపల్ పరిధిలో మిషనన్ భగీరథ ద్వారా 13,806 నల్లా కనెక్షన్లకు ప్రతిరోజూ సుమారు 1.25 కోట్ల లీటర్ల నీటిని సరఫరా చేస్తున్నారు. ఫిల్టర్ బెడ్ ద్వారా శుద్ధి చేస్తున్న ఈ నీటిని ఇటీవల అధికారులు ప్రత్యేకంగా పరీక్షించారు. నీరు తాగేందుకు సురక్షితమని ప్రజలకు అవగాహన కల్పిస్తూ అధికారులు సైతం నీటిని తాగి చూపించారు. అయినప్పటికీ ప్రైవేట్ వాటర్ ప్లాంట్లపై అదే స్థాయిలో నాణ్యత పర్యవేక్షణ ఉండాల్సిన అవసరం ఉంది.
20 లీటర్ల క్యాన్లలో వాటర్ అమ్మకాలు
కూలింగ్ వాటర్ అమ్మకాలు
అనాలసిస్ సర్టిఫికెట్లు ఏవీ?
క్యాన్లలో నీళ్లు.. నాణ్యతపై అనుమానాలు
నిబంధనలు మరచి విక్రయాలు
జిల్లాలో ‘మూడు ప్లాంట్లు,
ఆరు క్యాన్ల’లా వ్యాపారం
గతంలోనూ వాటర్ ప్లాంట్ల నిర్వహణపై ప్రజలు అనేక సందేహాలు వ్యక్తం చేసినా, తనిఖీలకు మించి కఠిన చర్యలు కనిపించడం లేదనే విమర్శలు ఉన్నాయి. జిల్లా కేంద్రంతో పాటు 12 మండలాల్లో ఉన్న ప్లాంట్లన్నింటినీ గుర్తించి ట్రేడ్ లైసెన్సులు, నీటి అనాలసిస్ సర్టిఫికెట్లు, శుద్ధి ప్రక్రియ, యంత్రాల నిర్వహణ, క్యాన్ల పరిశుభ్రత తదితర అంశాలపై సమగ్ర తనిఖీలు నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు. నిబంధనలు పాటిస్తున్న వివరాలు వినియోగదారులకు స్పష్టంగా కనిపించేలా అధికా రులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
నాణ్యత లేని నీటిని నిరంతరం తాగితే విరేచనాలు, వాంతులు, కడుపు సంబంధిత ఇబ్బందులు, నీటి ద్వారా వ్యాపించే అంటువ్యాధులు తలెత్తే ప్రమాదం ఉంటుంది. అపరిశుభ్రమైన డబ్బాలు, క్యాన్లు, ఫిల్టర్లు, పైపులైన్ల ద్వారా కూడా సూక్ష్మజీవులు నీటిలో చేరే అవకాశం ఉంది. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారిపై ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.


