జనగామ: జిల్లాలోని ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లోని 39 ప్రీప్రైమరీ విభాగాల్లో బాలా పెయింటింగ్స్ ఏర్పాటు చేసేందుకు అర్హత కలిగిన తయారీదారులు, డీలర్లు, సంస్థల నుంచి టెండర్లను ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్, సమగ్ర శిక్ష చైర్‌పర్సన్ సందీప్ కుమార్ ఝా శుక్రవారం తెలిపారు. ఈ పనులకు మొత్తం అంచనా వ్యయం రూ.9.75 లక్షలుగా నిర్ణయించగా, ఒక్కో పాఠశాలకు రూ.25 వేలుగా పేర్కొన్నారు. టెండర్‌లో పాల్గొనే వారు రూ.24,375 ఈఎండీతో పాటు రూ.500 టెండర్ డాక్యుమెంట్ ధరను జిల్లా విద్యాశాఖాధికారి, జనగామ పేరున డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో సమర్పించాలన్నారు. టెండర్ పత్రాల విక్రయం ఈ నెల 17 నుంచి 21వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు జిల్లా విద్యా శాఖాధికారి కార్యాలయంలో జరుగుతుంది. టెండర్లను ఈ నెల 22 నుంచి 25 వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు స్వీకరిస్తారు. అదే రోజు సాయంత్రం 4 గంటలకు జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో టెండర్లను తెరుస్తారు. పూర్తి వివరాలు టెండర్ పత్రాల్లో పొందుపరిచినట్లు అధికారులు తెలిపారు.
ఫోర్జరీ సంతకాలతో
నిధులు స్వాహా!
జఫర్‌గఢ్: ఫోర్జరీ సంతకాలతో పాఠశాలకు సంబంధించిన నిధులు స్వాహా అయిన సంఘటన మండలకేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలిలా ఉన్నాయి.. సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలకు పలు రకాల మెటీరియల్‌ను విద్యార్థులకు అందించేందుకు ప్రభుత్వం నిధులను మంజూరు చేసింది. ఈ మెటీరియల్‌ను అందించేందుకు ప్రభుత్వం టెండర్ విధానాన్ని అనుసరిస్తుంది. నిధులను చెక్కుల ద్వారానే సదరు కాంట్రాక్టర్లకు చెల్లించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఓ కాంట్రాక్టర్ తనకు రావాల్సిన చె క్కు నెలలు గడుస్తున్నా.. రాకపోవడంతో ప్రి న్సిపాల్‌ను సంప్రదించారు. అయితే చెక్కును ఇదివరకే ఇచ్చినట్లుగా పేర్కొనడంతో పాటు దీనికి సంబంధించిన డబ్బులు కూడా డ్రా అయినట్లు ప్రిన్సిపాల్ తెలిపారు. దీంతో నిధులు గోల్‌మాల్ జరిగినట్లు వెలుగులోకి వచ్చింది. ఈ విషయం అధికారులకు తెలియడంతో సంబంధిత అధికారులు పాఠశాలలో విచారణ చేపట్టగా పెద్ద మొత్తంలో నిధులు స్వాహా అయినట్లుగా గుర్తించారు. మరిన్ని వివరాలకు స్టేషన్‌ఘన్‌పూర్‌లోని బ్యాంక్ అకౌంట్ వివరాలను కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. ఇందులో ఎవరెవరి పాత్ర ఉందో విచారణలో తెలియాల్సి ఉంది. ఫోర్జరీ సంతకాలతోపాటు నిధుల గోల్‌మాల్‌పై పిన్సిపాల్ వరలక్ష్మి స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
కాంగ్రెస్ శ్రేణుల ర్యాలీ
జనగామ: హల్ద్వానీ ఘటనకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు సంఘీభావంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం మహాత్మాగాంధీ విగ్రహం నుంచి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వరకు మార్చ్ నిర్వహించి, అనంతరం ఆర్టీసీ చౌరస్తాలో సత్యాగ్రహం చేపట్టారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి మాట్లాడారు. హల్ద్వానీలో మల్లికార్జున్ ఖర్గే పాల్గొన్న ర్యాలీ ప్రాంగణాన్ని గంగాజలంతో శుద్ధి చేయడం వివక్షపూరిత చర్యగా అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో యాదగిరిగుట్ట ఆలయ ట్రస్టు బోర్డు సభ్యులు డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్, మున్సిపల్ చైర్‌పర్సన్ కడకంచి బాలమణి, వేమల్ల సత్యనారాయణరెడ్డి, రాజమౌళి, వంగాల కళ్యాణి, బొట్ల శ్రీనివాస్, ఉడత రవి, తదితరులు ఉన్నారు.
కేయూ ఇంజనీరింగ్
విద్యార్థి ప్రతిభ
కేయూ క్యాంపస్: హైదరాబాద్‌లోని తెలంగాణ పోలీస్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌లో సురక్షా తిరంగా సైబర్ అవగాహన కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఇందులో సైబర్ మోసాల నిరోధానికి కేయూ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థి సావస్కర్ వీడియో (రీల్)కు ద్వితీయ బహుమతి దక్కించుకుంది. అనంతరం సర్టిఫికెట్, ప్రశంసపత్రాలు అందించారు. డీజీపీ ఆనంద్, ప్రముఖ సినీనటుడు అక్కినేని నాగార్జున, పోలీస్ ఉన్నతాధికారి సజ్జనార్ చేతుల మీదుగా సావస్కర్ ప్రశంసపత్రం అందుకున్నారు. వర్సిటీ ఎడ్యుకేషనల్ ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన సాయికుందన్, సంజయ్ పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు అందుకున్నట్లు ఫ్యాకల్టీ కో–ఆర్డినేటర్ సంతోష్ తెలిపారు.


