జనగామ రూరల్: ఎన్నికలకు ముందు కల్లుగీత కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని కల్లుగీత వృత్తిని ఆధునీకరించి అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చి అమలు చేయకపోవడం ఇచ్చిన హామీలను విస్మరించడమేనని తక్షణం కల్లుగీత కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో అమరుల యాదిలో గీతన్నల చైతన్య యాత్ర సోమవారం జిల్లా కేంద్రానికి చేరుకుంది. ఈసందర్భంగా గీత కార్మికులు యాత్ర బృందానికి స్వాగతం పలికారు. సూర్యాపేట రోడ్డు నెల్లుట్ల శివారు నుంచి పట్టణంలోని ఓం సాయి గార్డెన్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జిల్లా కార్యదర్శి బాల్నే వెంకట మల్లయ్య అధ్యక్షతన బహిరంగ సభలో జాన్ వెస్లీ మాట్లాడుతూ.. రాష్ట్రంలో తాటిచెట్ల మీద నుంచి పడి మరణించినవారికి, వికలాంగులైన వారికి ఇవ్వాల్సిన ఎక్స్‌గ్రేషియా బకాయిలు రూ.20 కోట్లు ఉన్నాయన్నారు. అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో మొదటి వరుసలో ఉంటున్నామని ముఖ్యమంత్రి గొప్పలుచెబుతున్నారని, గీత కార్మికుల ఎక్స్‌గ్రేషియా బకాయిలకు నిధులు లేవా? అని ప్రశ్నించారు. నీరా ప్రాజెక్టుకు నిధులు కేటాయించి ఖర్చు చేయకపోవడం అణగారిన వర్గాలను చిన్నచూపు చూడడమే అని అన్నారు. సర్వాయి పాపన్న స్ఫూర్తితో కల్లుగీత కార్మికులు శ్రామిక వర్గ రాజ్య స్థాపన కోసం జరిగే పోరాటంలో భాగస్వాములు కావాలని అన్నారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎం. వి.రమణ మాట్లాడుతూ.. స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించి, సర్వాయి పాపన్న నిర్మించి న కోటలను పరిరక్షించి పర్యాటక కేంద్రాలుగా గుర్తించి నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు, విజయ్ కుమార్, హైకోర్టు న్యాయవాది నలుమాసు కృష్ణ, జిల్లా అధ్యక్షుడు బూడిది గోపి, ఉషగొని వెంకట నరసయ్య, గైని వెంకన్న, చౌగోని సీతారాములు, గైని సాంబయ్య, భీమగోని చంద్రయ్య, పాముకుంట్ల ప్రసాద్, గోపగోని సుగుణాకర్, బూడిది జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
ఎక్స్‌గ్రేషియా బకాయిలకు నిధులు లేవా?
సర్వాయి పాపన్న కోటలను పరిరక్షించాలి
గీతన్నల చైతన్య యాత్రలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ


