న్యూస్‌రీల్
శాకంబరీ అలంకరణలో శ్రీఉప్పలమ్మ మాత
జనగామ: ఆషాఢ మాసం చివరి ఆదివారం పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ ఏరియా అమ్మబావి వద్ద గల శ్రీ ఉప్పలమ్మ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని శాకంబరీ అలంకరణలో సర్వాంగ సుందరంగా అలంకరించి భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రధాన పూజారి వారణాసి పవన్‌శర్మ మంత్రోచ్ఛరణల మధ్య ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ మోహన్ గౌడ్, దేవాదాయ శాఖ ఉద్యోగి రాజేందర్‌రెడ్డితో పాటు ఆలయ సిబ్బంది, భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
నేటి ప్రజావాణి రద్దు
జనగామ రూరల్: ఈనెల 10న(సోమవారం) నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. బోనాల పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించిన నేపథ్యంలో రద్దు చేసినట్లు పేర్కొన్నారు. జిల్లా ప్రజలు ఈ విషయాన్ని గమనించి, రేపు ప్రజావాణి కార్యక్రమం కోసం జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయానికి దరఖాస్తులతో రావొద్దని కోరారు.
యోగా, స్వీయ రక్షణ బోధకుల ఎంపిక పరీక్ష
జనగామ రూరల్: జిల్లాలోని పీఎంశ్రీ పాఠశాలల్లో యోగా, స్వీయ రక్షణ శిక్షణ అందించేందుకు బోధకుల ఎంపిక ప్రక్రియలో భాగంగా ఆదివారం కలెక్టర్ కార్యాలయంలోని మెయిన్ కాన్ఫరెన్స్ హాల్‌లో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆధ్వర్యంలో పరీక్షలు, డెమో నిర్వహించారు. పీఎంశ్రీ పాఠశాలల్లో 15 యోగా టీచర్ పోస్టులకు గాను 22 మంది అభ్యర్థులు పరీక్ష అలాగే డెమోకు హాజరయ్యారు. అలాగే 15 స్వీయ రక్షణ ఇన్‌స్ట్రక్టర్ పోస్టులకు గాను 37 మంది అభ్యర్థులకు పరీక్ష, డెమో నిర్వహించారు. అలాగే అంతర్జాతీయ ఎక్స్‌పోజర్ విజిట్ కోసం ఎంపిక ప్రక్రియ కూడా నిర్వహించారు. ఇందుకోసం జిల్లాకు చెందిన 10 మంది ఉపాధ్యాయులు పరీక్షకు హాజరయ్యారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బెన్‌షాలోమ్, విద్యాశాఖ ఏడీ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
నేడు జిల్లాకు గీతన్నల చైతన్యయాత్ర
జనగామ రూరల్: తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో చేపడుతున్న అమరుల యాదిలో గీతన్నల చైతన్య యాత్ర సోమవారం జనగామకు చేరుకోనుంద ని కల్లుగీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బాల్నె వెంకట మల్లయ్య, బూడిది గోపి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా ఉదయం 9:30 గంటలకు యాత్ర జనగామకు చేరుకుంటుందని, సూర్యాపేట రోడ్డు పెట్రోల్ పంపు నుంచి యాత్ర బృందానికి స్వాగతం పలికి బైక్ ర్యాలీ ఉంటుందన్నారు. అనంతరం సిద్దిపేట రోడ్డులోని ఓం సాయి గార్డెన్‌లో బహిరంగ సభ ఉంటుందన్నా రు. ఈ బస్సుయాత్రల్లో రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు ఎంవీ రమణ, బెల్లంకొండ వెంకటేశ్వర్లు ముఖ్య అతిథులుగా పాల్గొంటారన్నారు.
జనగామ: జిల్లాలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, పరిమితంగా ఉన్న సాగునీటి వనరులను దృష్టిలో ఉంచుకుని ఈసారి పంటల సాగులో మార్పులు తీసుకురావడంపై అధికారులు దృష్టి సారించారు. నీటి లభ్యతను అంచనా వేయకుండా అధిక నీటి అవసరమున్న వరిసాగు చేపడితే మధ్యలో నీటి కొరత ఏర్పడి రైతులు నష్టపోయే అవకాశం ఉండటంతో ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లించాలని సూచిస్తున్నారు. కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశాల మేరకు ఈ నెల 8, 9, 10వ తేదీల్లో జిల్లాలోని అన్ని మండలాల్లో గ్రామాల వారీగా అవగాహన సదస్సులు, గ్రామసభలు నిర్వహిస్తున్నారు.
నీటి లభ్యతే ప్రాతిపదికగా
వర్షాలు సమృద్ధిగా కురిసిన సమయంలో వరి సాగుకు రైతులు ప్రాధాన్యం ఇస్తారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో చెరువులు, కుంటలు, కాలువల్లో నీటి నిల్వలు, బావులు, బోర్లలో భూగర్భజలాల లభ్యతను ముందుగా అంచనా వేసి పంటను ఎంపిక చేసుకోవాల్సిన అవసరం ఉందని అధికారులు చెబుతున్నారు. నీరు అందుబాటులో ఉండే ఆయకట్టు ప్రాంతాల్లోనూ నీటిని పొదుపుగా వినియోగించాలని, నీటి లభ్యత పరిమితంగా ఉన్న ప్రాంతాల్లో వరి సాగుకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.
ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి
వరి సాగుకు బదులుగా జొన్న, మొక్కజొన్న, కందులు, పెసలు, అలసందలు, పత్తి, నూనె గింజలు, చిరుధాన్యాలు, పశుగ్రాస పంటలు, ఉద్యానవన పంటలు, ఆయిల్‌పామ్ వంటి పంటలను సాగు చేసుకోవాలని రైతులకు వివరిస్తున్నారు. ఆయా పంటలకు అవసరమయ్యే నీటి పరిమాణం, నేల స్వభావం, వాతావరణ పరిస్థితులు, మార్కెట్ అవకాశాలను పరిగణనలోకి తీసుకుని పంట ఎంపిక చేసుకోవాలని సూచిస్తున్నారు.
వర్షం కోసం ఎదురుచూస్తే
వర్షాధార ప్రాంతాల్లో వానలపై ఆధారపడి పంటను సాగు చేసే పరిస్థితి ఉంటే రైతులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుందని చెబుతున్నారు. పంట మధ్యలో నీటి అవసరం పెరిగే సమయంలో వర్షాలు సహకరించకపోతే పెట్టుబడి మొత్తం నష్టపోయే ప్రమాదం ఉంటుంది. అందువల్ల ముందుగానే నీటి లభ్యతను అంచనా వేసి తక్కువ నీటితో సాగయ్యే పంటలను ఎంచుకోవడం ద్వారా నష్టాన్ని కొంతమేర తగ్గించుకోవచ్చని వివరిస్తున్నారు. అవసరమైన చోట డ్రిప్, సూక్ష్మ సాగునీటి పద్ధతులను వినియోగించడం ద్వారా నీటి వృథా తగ్గించవచ్చని చెబుతున్నారు.
శాఖల సమన్వయంతో..
గ్రామసభల్లో వ్యవసాయ, ఉద్యానవన, నీటిపారుదల, పశుసంవర్ధక, గ్రామీణాభివృద్ధి అధికారులు పాల్గొంటున్నారు. ఎంఏఓలు, ఏఈఓలు, ఉద్యానవన శాఖ అధికారులు, నీటిపారుదల శాఖ ఏఈ లు, ఎంపీడీఓలు, పశుసంవర్ధక శాఖ వైద్యులు, ఉపాధి సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు రైతులకు శాఖల వారీగా సూచనలు అందిస్తున్నారు. చెరువులు, కాలువల్లో నీటినిల్వలు, ఆయకట్టు పరిస్థితి, సాగునీటి విడుదల తదితర అంశాలపై వివరాలు అందిస్తున్నారు.
జిల్లాలో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులకు ప్రాధాన్య క్రమంలో సాగునీరు అందించేందుకు అధికారులు ప్రణాళిక రూపొందించారు. ఆగస్టు 15 నుంచి మొదటి విడత, 25 నుంచి రెండో విడతలో నీటిని విడుదల చేయనున్నారు. ప్రస్తుతం రిజర్వాయర్లలో సుమారు 1.5 టీఎంసీల నీరు నిల్వ ఉండగా, నీటి ల భ్యతను బట్టి ఆయకట్టు ప్రాంతాలకు నీటిని అందించనున్నారు.
ఒకే పంటపై ఆధారపడకుండా పరిస్థితులకు అనుగుణంగా పంట మార్పిడి చేపట్టడం వల్ల నీటి ఒత్తిడిని తగ్గించడంతో పాటు భూమి ఉత్పాదకతను కాపాడుకోవచ్చని వివరిస్తున్నారు. రైతులు తమ భూమి స్వభావం, నీటి వనరు, పెట్టుబడి సామర్థ్యం, మార్కెట్ డిమాండ్‌ను పరిశీలించి పంటను ఎంచుకోవా లని సూచిస్తున్నారు. సాగు ప్రారంభించే ముందు నీటిలభ్యతను లెక్కించుకోవడం అత్యంత కీలకమని అధికారులు పేర్కొంటున్నారు. కేవలం సాగునీరు వస్తుందనే అంచనాతో అధిక నీటి అవసరమున్న వరిసాగు చేపట్టి చివరిలో ఇబ్బందులు పడకుండా ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టాలని కోరుతున్నారు. ఈ నెల 8 నుంచి 10 వరకు జరుగుతున్న గ్రామసభల ద్వారా రైతుల స్థాయిలోనే నీటి పొదుపు, పంటల ఎంపికపై అవగాహన కల్పించడం ద్వారా ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల్లో సాగు నష్టాలను తగ్గించడమే లక్ష్యంగా అధికారులు చర్యలు చేపడుతున్నారు.
సుమారు 13 ఏళ్ల తర్వాత పోలీస్ అధికారుల సంఘానికి ఎన్నికలు
110 మంది ప్రతినిధుల ఎంపిక పూర్తి
13 పోస్టులకు 13న ప్రత్యక్ష ఎన్నిక
పోటాపోటీగా ప్రచారం


