సాక్షి ప్రతినిధి, వరంగల్:
పోలీస్ శాఖలో ఎన్నికల సందడి పెరిగింది. సుమారు పదమూడేళ్ల తర్వాత పోలీస్ అధికారుల సంఘానికి ఎన్నికలు జరగలేదు. తెలంగాణ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ (టీజీపీఓఏ) కొత్త కార్యవర్గాల ఎన్నికల నిర్వహణకు ఇటీవలే డీజీపీ సీవీ.ఆనంద్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈమేరకు జిల్లాలు, కమిషనరేట్లు, బెటాలియన్లు, వివిధ యూని ట్లలో ఎన్నికల ప్రక్రియకు తెరలేచింది. ఇందులో భాగంగా.. వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లోనూ ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. ఎన్నికల అధికారిగా అడిషనల్ డీసీపీ (అడ్మిన్) ఆర్.ప్రభాకర్‌రావు వ్యవహరిస్తుండగా.. మూడు జిల్లాల్లో 110 మంది ప్రతినిధుల ఎంపిక పూర్తయ్యింది. వీరంతా కార్యవర్గ సభ్యుడి నుంచి అధ్యక్షుడి వరకు 13 మంది ఆఫీ్ బేరర్లను ఎన్నుకోవాల్సి ఉంది.
13 ఏళ్ల తర్వాత.. 13న ఎన్నికలు
టీజీపీఓఏకు మూడేళ్లకోసారి ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నప్పటికీ కొన్నేళ్లుగా ఎన్నికలు జరగలేదు. దీంతో సుమారు 13 ఏళ్లుగా పోలీస్ అధికారుల సంఘానికి ఎన్నికలు లేకుండాపోయాయి. డీజీపీగా సీవీ ఆనంద్ బాధ్యతలు చేపట్టిన అనంతరం సంఘం ఎన్నికలపై దృష్టి సారించారు. డీజీపీ ఉత్తర్వుల ప్రకారం.. జిల్లాలు, కమిషనరేట్ల యూనిట్ కమిటీల్లో అధ్యక్షుడు, ఇద్దరు ఉపాధ్యక్షులు, కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి, ఆర్గనైజింగ్ కార్యదర్శి, కోశాధికారి, ఆరుగురు కార్యవర్గ సభ్యుల పదవులకు ఈ ఎన్నికలు జరుగుతాయి. అధ్యక్ష పదవిని సివిల్ లేదా ఆర్ముడ్ వింగ్‌కు చెందిన కానిస్టేబుల్ నుంచి ఏఎస్‌ఐ స్థాయి వరకు చేపట్టవచ్చు. ఎస్‌ఐ/ఇన్‌స్పెక్టర్ ఎన్నికై తే ఇద్దరు ఉపాధ్యక్షుల్లో ఒకరు హెడ్ కానిస్టేబుల్ లేదా కానిస్టేబుల్ స్థాయి నుంచి ఉండాలి. అదే హెడ్ కానిస్టేబుల్ లేదా కానిస్టేబుల్ అధ్యక్షుడైతే ఇద్దరు ఉపాధ్యక్షులు ఎస్‌ఐ/ఇన్‌స్పెక్టర్ స్థాయికి చెందిన వారై ఉండాలి. సివిల్ పోలీస్ కోటాలో ఒక స్థానాన్ని మహిళా పోలీసులకు రిజర్వ్ చేసినట్లు పోలీసువర్గాల సమాచారం. కాగా, ఎగ్జిక్యూటివ్ మెంబర్ నుంచి అధ్యక్షుడి వరకు 13 పోస్టులకు 13న ఎన్నికలు జరగనున్నాయి.
‘పొలిటికల్’ను తలపిస్తూ..
కమిషనరేట్ పరిధి అన్ని సర్కిళ్ల వారీగా 50 మందికి ఒకరు చొప్పున మొత్తం 110 మంది ప్రతినిధులను ఇప్పటికే ఎన్నుకున్నారు. ఈనెల 13న జరిగే ఎన్నికల్లో అందులో నుంచి 13 మందిని ఆఫీస్ బేరర్లుగా ఎన్నుకున్న తర్వాత మరో ఇద్దరు సభ్యులను నామినేట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈనేపథ్యంలో సంఘం ద్వారా పోలీస్ అధికారులు, సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలు, సంక్షేమం, సేవా పరిస్థితులు, ఇతర అంశాలపై తమ గళాన్ని వినిపించే అవకాశం ఉండడంతో ఎన్నికలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఎన్నో ఏళ్ల తర్వాత పోలీస్ అధికారుల సంఘానికి ఎన్నికలు జరుగుతుండడంతో వరంగల్ కమిషనరేట్‌లోనూ ఎన్నికలపై ఆసక్తి నెలకొంది. వివిధ విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బంది తమకు అనుకూలమైన అభ్యర్థులను బరిలో నిలిపేందుకు సిద్ధమయ్యారు. కార్యవర్గ సభ్యుడు మొదలుకొని అధ్యక్ష పదవి కోసం అర్హులైన పలువురు పోటీ పడుతున్నారు. ఇందులో కొందరు ఏసీపీ, డీసీపీ స్థాయి అధికారులు తమ అనుయాయులను ఎన్నికల బరిలోకి దింపుతున్నట్లు ప్రచారం. అభ్యర్థులుగా బరిలోకి దిగే కొందరు మద్యం, డబ్బుల పంపిణీకి శ్రీకారం చుట్టారన్న ప్రచారం కూడా జరుగుతోంది. పొలిటికల్ పార్టీలను తలపించే రీతిలో మరికొందరు ప్రచారం నిర్వహిస్తుండడం పోలీస్‌శాఖలో చర్చనీయాంశమవుతోంది.


