సాక్షి, వరంగల్/నల్లబెల్లి: తెలంగాణ ఉద్యమకారుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబానికి బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆత్మీయ ఓదార్పునిచ్చారు. పెద్ది సుదర్శన్‌రెడ్డి దశదినకర్మ సందర్భంగా ఆదివారం వరంగల్ జిల్లా నల్లబెల్లి మండల కేంద్రంలోని పెద్ది స్వగృహానికి కేసీఆర్ వచ్చి కుటుంబ సభ్యులను పరామర్శించారు. విషాదంలో ఉన్న పెద్ది సతీమణి స్వప్నను ఓదార్చి ధైర్యం చెప్పారు. కుటుంబానికి బీఆర్‌ఎస్ ఎల్లవేళలా అండగా ఉంటుందని భరో సా కల్పించారు. ఎర్రవెల్లిలోని తన ఫాంహౌస్ నుంచి రోడ్డు మార్గంలో బయల్దేరిన కేసీఆర్ మధ్యాహ్నం 3.50 గంటలకు నల్లబెల్లిలోని పెద్ది సుదర్శన్‌రెడ్డి నివాసానికి చేరుకున్నారు. తొలుత సుదర్శన్‌రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కేసీఆర్‌ను చూడగానే స్వప్న భావోద్వేగానికి గురై బోరున విలపించారు. సుదర్శన్‌రెడ్డితో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్న కేసీఆర్ సైతం భావోద్వేగానికి లోనయ్యారు. అనంతరం కుమారుడు నిదర్శన్‌రెడ్డి, కుమార్తె ధర్మిష్ఠకు రూ.కోటి చొప్పున, సుదర్శన్‌రెడ్డి తల్లి అమృతమ్మకు రూ.25 లక్షల చొప్పున చెక్కులు అందించారు. మొత్తం రూ.2.25 కోట్ల ఆర్థిక సాయం అందించారు. కుటుంబ సభ్యులతో 45 నిమిషాల పాటు ముచ్చటించిన కేసీఆర్.. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. సాయంత్రం 4.35 గంటలకు న ల్లబెల్లి నుంచి హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యారు. అంతకుముందు నల్లబెల్లికి వచ్చే క్రమంలో గూడెప్పాడ్ వద్ద బీఆర్‌ఎస్ కార్యకర్త వనకర్ రెడ్డి ఇంటి వద్ద కొద్దిసేపు ఆగి వెళ్లారు.
భారీగా తరలివచ్చిన కార్యకర్తలు
కేసీఆర్ నల్లబెల్లికి వస్తున్నారనే సమాచారంతో బీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలు రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చారు. ‘పెద్ది’ కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం కేసీఆర్ మడికొండలోని సత్యసాయి కన్వెన్షన్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన లంచ్ కార్యక్రమంలో వేలాది మంది కార్యకర్తలతో కలి సి పాల్గొన్నారు. పార్టీ సీనియర్ నేత కెప్టెన్ లక్ష్మీకాంతారావుతో పాటు ఉమ్మడి జిల్లాకు చెందిన ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. అనంతరం ఎర్రవెల్లి నివాసానికి తిరుగు ప్రయాణమయ్యారు. కేసీఆర్ వెంట జీవన్‌రెడ్డి, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ముఖ్యులు జి.జగదీశ్వర్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కల్వకుంట్ల సంజయ్, పాడి కౌశిక్‌రెడ్డి, అనిల్‌జాదవ్, గంగుల కమలాకర్, మాజీ ఎంపీ సంతోశ్‌కుమార్, ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి ఉన్నారు.
సంతాప సభ ఏర్పాట్లపై ఆరా
నల్లబెల్లిలో సోమవారం నిర్వహించనున్న పెద్ది సంతాప సభ ఏర్పాట్లపై నాయకులతో కేసీఆర్ మాట్లాడారు. సభకు హాజరయ్యే అభిమానులందరికీ భోజనాలు ఏర్పాటు చేయాలని సూచించారు.
నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి దశదినకర్మకు మాజీ సీఎం హాజరు
పెద్ది స్వప్నను పరామర్శించి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా
రూ.2.25 కోట్ల చెక్కులను కుటుంబ సభ్యులకు అందించిన బీఆర్‌ఎస్ అధినేత
ప్రముఖుల పరామర్శ..
మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, సిరికొండ మధుసూదనాచారి, జీవన్‌రెడ్డి, తాటికొండ రాజయ్య, బీఆర్‌ఎస్ నాయకులు పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, బోయినపల్లి వినోద్‌కుమార్, వినయ్‌భాస్కర్, అరూరి రమేశ్, బండా ప్రకాశ్, డీఎస్ రెడ్యానాయక్, మాలోత్ కవిత, శంకర్‌నాయక్, నన్నపునేని నరేందర్, గండ్ర జ్యోతి, ఎర్రోళ్ల శ్రీనివాస్, హరిరమాదేవి, సాంబారి సమ్మారావు, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తదితరులు పెద్ది కుటుంబ సభ్యులను పరామర్శించారు.


