● ఎమ్మెల్యే కడియం శ్రీహరి
స్టేషన్‌ఘన్‌పూర్: నియోజకవర్గంలోని అన్ని రిజర్వాయర్లలో నీటి నిల్వలు పెంచి అందుబాటులో ఉన్న నీటితో రైతులకు సాగునీరు అందించేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ఘన్‌పూర్ రిజర్వాయర్ కుడికాల్వను నీటిపారుదలశాఖ, మున్సిపల్ అఽధికారులు, ప్రజాప్రతినిఽధులతో కలిసి శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఘన్‌పూర్ మున్సిపాలిటీ ఎస్సీ కాలనీ నుంచి వెళ్తున్న పంట కాల్వను, తూము వద్ద కాల్వను పరిశీలించారు. పంటల కాల్వకు రెండువైపులా వాల్స్ నిర్మాణం చేసి చివరివరకు సాగునీరు వెళ్లే విధంగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని పంచాయతీ అధికారులను ఆదేశించారు. అనంతరం ఘన్‌పూర్‌లో మాజీ ఎంపీటీసీ డాక్టర్ అంబటి జైహింద్‌రాజ్ నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 14న రిజర్వాయర్ల ద్వారా సాగునీరు ఆన్ అండ్ ఆఫ్ పద్దతిలో అందిస్తామని, 15 రోజుల పాటు నీటి విడుదల జరుగుతుందని, మరో 15రోజుల పాటు రిజర్వాయర్లలో నీటిని నింపుతామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్‌కుమార్, వైస్ చైర్మన్ నీల రాజమ్మగట్టయ్య, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అంబటి కిషన్‌రాజ్, నీటిపారుదల శాఖ ఎస్‌ఈ సీతారాం, కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు బెలిదె వెంకన్న, గట్టు రమేష్, పెసరు సారయ్య, గన్ను నర్సింహులు, సింగపురం దయాకర్, వెంకటయ్య, తెల్లాకుల రామకృష్ణ, చింత ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.


