న్యూస్‌రీల్
మామునూరు ఎయిర్‌పోర్ట్ నమూనా (ఏఐ చిత్రం)
సాక్షి, వరంగల్ :
ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న మామునూరు విమానాశ్రయం కల సాకారం దిశగా కీలక అడుగు పడింది. ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) సుమారు రూ.203.49 కోట్లతో విమానాశ్రయ అభివృద్ధి పనులకు టెండర్లు పిలిచింది. రన్‌వే ఆధునీకరణ నుంచి టెర్మినల్‌కు అనుసంధాన రహదారులు, విమానాల పార్కింగ్ అప్రాన్, ట్యాక్సీ వేలు, గ్రౌండ్ సపోర్ట్ సదుపాయాల వరకు అన్ని పనులను 15 నెలల్లో పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రణాళిక రూపొందించారు. ఈ మేరకు మాస్టర్ ప్లాన్ కూడా విడుదల చేసింది. ఈ ప్లాన్ ప్రకారం విమానాశ్రయానికి ప్రధాన ఎంట్రీ, ఎగ్జిట్‌ను వరంగల్–సూర్యాపేట జాతీయ రహదారి (ఎన్‌హెచ్–563) వైపు ప్రతిపాదించారు. అక్కడి నుంచి ప్రత్యేక యాక్సెస్ రోడ్డు ద్వారా టెర్మినల్ భవనానికి చేరుకునేలా డిజైన్ రూపొందించారు. టెర్మినల్ ఎదుట ఒకేసారి మూడు విమానాలు నిలిపే అప్రాన్, లింక్ ట్యాక్సీవే, గ్రౌండ్ సపోర్ట్ ఎక్విప్‌మెంట్ (జీఎస్‌ఈ) ప్రాంతం, పెరిమీటర్ రోడ్లు, అత్యవసర యాక్సెస్ రోడ్లు కూడా ఏర్పాటు చేయనున్నారు. 1930లోనే నిజాం హయాంలోనే మామూనూరు ఎయిర్‌పోర్టు ఉండగా వివిధ కారణాలతో 1980లో మూతపడిన సంగతి తెలిసిందే.
సెప్టెంబర్ 7న ఫైనాన్షియల్ బిడ్...
ఈ నెల 23న (గురువారం)ప్రీ–బిడ్ సమావేశాన్ని మామునూరు విమానాశ్రయ ప్రాంగణంలో ఏర్పాటు చేసినట్టు టెండర్ నోట్‌లో పేర్కొన్నారు. జూలై 29 నుంచి ఆగస్టు 12 వరకూ బిడ్ దాఖలకు అవకాశం కల్పించారు. ఆగస్టు 18న బిడ్ ఓపెన్ చేయనున్నారు. సెప్టెంబరు 7న ఫైనాన్షియల్ బిడ్‌ను తెరవనున్నట్టు టెండర్ నోట్‌లో పొందుపరిచారు. మెయింటెనెన్స్ రిపేర్ అండ్ ఓవర్‌హాల్, ఫ్లయింగ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ సహా మరికొన్ని నిర్మాణాలకు త్వరలో మరో టెండర్‌ను పిలిచేందుకు ఏఏఐ అధికారులు సిద్ధమవుతున్నట్టు తెలిసింది.
కాకతీయ వైభవం ఉట్టిపడేలా...
తెలంగాణకు చారిత్రక వారసత్వంగా నిలిచిన కాకతీయుల కళా సంపదను ప్రతిబింబించేలా మూమునూరు విమానాశ్రయ టెర్మినల్ భవ నం, ప్రవేశ ద్వారాలు, అంతర్గత అలంకరణలను రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరగా, అందుకు కేంద్రం సానుకూలంగా స్పందించింది టెర్మినల్ ముఖద్వారంలో కాకతీయ కళాతోరణం శైలిని ప్రతిబింబించే నమూనాలు, లోపలి గోడలపై కాకతీయుల చరిత్రను తెలియజేసే చిత్రాలు, శిల్పాల ప్రతిరూపాలు, తెలంగాణ జానపద సంస్కృతిని చాటిచెప్పే అలంకరణలు ఉండేలా ప్రణాళిక రూపొందించే అవకాశ ముంది. దీంతో వరంగల్‌కు వచ్చే దేశీయ, విదేశీ ప్రయాణికులకు విమానాశ్రయంలోనే కాకతీయుల గొప్పతనం పరిచయం కానుంది. 2,800 మీటర్ల పొడవు, 75 మీటర్ల వెడల్పు గల రన్‌వే నిర్మాణంతో ఎయిర్‌బస్–320 వంటి పెద్ద ప్రయాణికుల విమానాలు, భారీ కార్గో విమానాలు కూడా దిగే అవకాశం ఉంటుంది. భవిష్యత్‌లో అంతర్జాతీయ విమానాశ్రయంగా విస్తరించే అవకాశాన్ని దృష్టిలో పెట్టుకుని 949.44 ఎకరాల్లో ప్రణాళిక సిద్ధం చేశారు.
వెడల్పు :
75 మీటర్లు
అభివృద్ధి పనులకు టెండర్లు పిలిచిన ఏఏఐ
టెర్మినల్ ఎదుట ఒకేసారి
మూడు విమానాలు నిలిపే అప్రాన్
కాకతీయ కళా వైభవం చాటేలా
నిర్మాణాలు ఉండే అవకాశం
2028లో విమానాలు
టేకాఫ్ అయ్యేలా కార్యాచరణ
ఇక్కడి వ్యాపారవేత్తలు హైదరాబాద్, చైన్నె, బెంగళూరు, ఢిల్లీ, ముంబై వంటి నగరాలకు ఒకే రోజులో వెళ్లి తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. దీంతో వ్యాపార సమావేశాలు, పెట్టుబడులు, స్టార్టప్‌లు, కార్పొరేట్ కార్యకలాపాలు మరింత వేగవంతం అవుతాయి. కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్, ఐటీ, ఫార్మా, లాజిస్టిక్స్ రంగాలకు వేగవంతమైన రవాణా అందుబాటులోకి వస్తుంది. దేశీయ, విదేశీ కంపెనీలు వరంగల్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపే అవకాశం ఉంది. వ్యవసాయ, పారిశ్రామిక ఉత్పత్తులను దేశంలోని ఇతర ప్రాంతాలకు త్వరగా తరలించొచ్చు. దీంతో రైతులకు మెరుగైన మార్కెట్లు లభించడంతోపాటు ఎగుమతులకు కూడా మార్గం సుగమం అవుతుంది. రామప్ప ఆలయం, వరంగల్ కోట, వేయి స్తంభాల గుడి, భద్రకాళి ఆలయానికి పర్యాటకుల రాక పెరుగుతుంది. ఎయిర్ అంబులెన్స్, అవయవ మార్పిడి, విపత్తుల సమయంలో సహాయక చర్యలు వేగంగా చేపట్టవచ్చు. రియాల్టీ రంగానికి కూడా రెక్కలు రానున్నాయి. మామునూరు విమానాశ్రయనిర్మాణం నుంచి నిర్వహణ వరకు ప్రత్యక్ష, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి లభిస్తుంది. నగరం దేశంలోని ప్రధాన నగరాలతో నేరుగా అనుసంధానమవుతుంది. దీంతో జాతీయస్థాయిలో గుర్తింపు వస్తుంది.
రన్‌వే పొడవు :
2,800
మీటర్లు


