● సీపీఎం జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి
జనగామ రూరల్: పట్టణంలో మూడో విడత ఇందిరమ్మ లబ్ధిదారులు నిర్మించుకున్న ఇళ్లకు ఇంటి నంబర్లు కేటాయించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి డిమాండ్ చేశారు. శనివారం మూడో విడత ఇందిరమ్మ లబ్ధిదారులతో కలిసి సీపీఎం పట్టణ కార్యదర్శి జోగు ప్రకాశ్ ఆధ్వర్యంలో కలె క్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించా రు. ఈ సందర్భంగా కనకారెడ్డి మాట్లాడుతూ 2012–13 సంవత్సరంలో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం 1,146 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చి స్థలం చూపించకపోవడంతో సీపీఎం ఆధ్వర్యంలో ప్రభుత్వ భూమిలో గుడిసెలు నిర్మించుకుంటే ప్రభుత్వం తొలగించే ప్రయత్నం చేస్తుందన్నారు. అధికారులు కూడా రీసర్వే పేరుతో ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. మున్సిపల్ ద్వారా ఇంటినంబర్ కేటాయించాలని విన్నవించినా ఫలితం లేదన్నారు. కాగా కలెక్టరేట్ ఎదుట ధర్నా చేస్తున్న నాయకులను అక్రమంగా అరెస్ట్ చేసే క్రమంలో పోలీసులకు లబ్ధిదారులకు మధ్య తోపులాట జరిగింది. అలాగే ఏసీపీ భీమ్ శర్మ పోలీస్‌స్టేషన్‌లో నాయకులపై అమర్యాదగా అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ అంబేడ్కర్ విగ్రహం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఏసీపీపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు బొట్ల శేఖర్, సుంచు విజేందర్, మిట్యా నాయక్, కౌన్సిలర్ బూడిద జ్యోతి, కల్యాణ లింగం, పగిడిపల్లి బాలమణి, బూడిద ప్రశాంత్, బొట్ల శ్రావణ్, పాము శ్రీకాంత్, అండాలు నాగమణి తదితరులు పాల్గొన్నారు.


