ఉల్లంఘనులపై ఉక్కుపాదం | - | Sakshi
Sakshi News home page

ఉల్లంఘనులపై ఉక్కుపాదం

Jul 16 2026 5:12 AM | Updated on Jul 16 2026 5:12 AM

పట్టణంలో వివిధ ప్రభుత్వ శాఖలు సంయుక్తంగా నిబంధనల ఉల్లంఘనలపై బుధవారం విస్తృత తనిఖీలు నిర్వహించాయి. మున్సిపల్‌ అధికారులు అక్రమ సెల్లార్లు, నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ఓ భారీ భవనాన్ని సీజ్‌ చేశారు. కమర్షియల్‌ టాక్స్‌ అధికారులు ప్రైవేట్‌ ఆస్పత్రులకు ప్రొఫెషనల్‌ టాక్స్‌ బకాయిల చెల్లింపుపై నోటీసులు జారీ చేశారు. వైద్య ఆరోగ్యశాఖ అనుమతులు లేని ల్యాబ్‌ను సీజ్‌ చేయగా, రెవెన్యూ, విద్యుత్‌, ఫైర్‌ సేఫ్టీ, ఇంటర్మీడియట్‌ బోర్డు తదితర శాఖలు కూడా ఆకస్మిక తనిఖీలు చేపట్టి ఉల్లంఘనలపై చర్యలు ప్రారంభించాయి.

జనగామ: పట్టణంలో నిబంధనలకు విరుద్ధంగా సెల్లార్లను వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్న భవన యజమానులపై మున్సిపల్‌ అధికారులు ఉక్కుపాదం మోపారు. పార్కింగ్‌ కోసం నిర్మించిన సెల్లార్లలో వ్యాపార సంస్థలు నిర్వహించడం వల్ల ప్రజలకు పార్కింగ్‌ ఇబ్బందులు తలెత్తడంతో పాటు రోడ్లపై వాహనాలు నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో మున్సిపల్‌ కమిషనర్‌ రాజశేఖర్‌రెడ్డి ఆదేశాల మేరకు పట్టణ ప్రణాళిక, రెవెన్యూ, విద్యుత్‌, ఇంటర్మీడియట్‌, అగ్నిమాపక, తదితర శాఖల అధికారులతో కలిసి ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. గతనెల 17న ‘సెల్లార్లలో వ్యాపారాలు, రోడ్లపై వాహనాల పార్కింగ్‌’ సాక్షిలో శీర్షికతో ప్రచురితమైన కథనానికి స్పందించిన కమిషనర్‌ జిల్లా కేంద్రంలోని స్వర్ణ కళామందిర్‌ ప్రాంతంలో ఉన్న సెల్లార్లను క్షుణ్ణంగా పరిశీలించారు. నిబంధనలు ఉల్లంఘించిన భవన యజమానులకు ఇప్పటికే మొదటి, రెండో నోటీసులు జారీ చేసి నెల రోజుల గడువు ఇచ్చినప్పటికీ పరిస్థితిలో మార్పు రాకపోవడంతో ఐదు సెల్లార్లను సీజ్‌ చేశారు. సీజ్‌ చేసిన సెల్లార్ల తాళాలు, సీళ్లను మున్సిపల్‌ అధికారులు స్వాధీనం చేసుకుని తదుపరి చర్యలు ప్రారంభించారు.

కొనసాగనున్న తనిఖీలు

పట్టణంలోని హైదరాబాద్‌ రోడ్‌, హనుమకొండ రోడ్‌, సూర్యాపేట రోడ్‌, సిద్దిపేట రోడ్‌, కృష్ణ, స్వర్ణ కళామందిర్‌ ప్రాంతాలతో పాటు ఇతర ప్రధాన వాణిజ్య ప్రాంతాల్లో దశలవారీగా తనిఖీలు నిర్వహించి నిబంధనలకు విరుద్ధంగా వినియోగిస్తున్న సెల్లార్లపై ఇదే తరహా చర్యలు కొనసాగిస్తామని తెలిపారు. ప్రతీ భవనం మున్సిపల్‌ నిబంధనలకు అనుగుణంగా ఉండాలని, అనుమతులు పొందిన విధంగానే వినియోగించాలని కమిషనర్‌ రాజశేఖర్‌రెడ్డి సూచించారు. తనిఖీల్లో నాని హాస్పిటల్‌ పరిధిలోని సెల్లార్‌, ఎస్‌కే సూపర్‌ బజార్‌, బిగ్‌ బజార్‌, తుల్జాభవానీ లేడీస్‌ ఎంపోరియం తదితర వ్యాపార సముదాయాలకు చెందిన సెల్లార్లను సీజ్‌ చేసి తదుపరి చట్టపరమైన చర్యలకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

అనుమతులు లేని ల్యాబ్‌ సీజ్‌

పట్టణంలోని నాని ప్రైవేట్‌ ఆసుపత్రిలో నిబంధనలకు విరుద్ధంగా అవసరమైన రిజిస్ట్రేషన్‌, అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న ల్యాబొరేటరీని సంబంధిత అధికారులు సీజ్‌ చేశారు. తనిఖీల సందర్భంగా ల్యాబ్‌ నిర్వహణలో నిబంధనల ఉల్లంఘనలు గుర్తించిన అధికారులు వెంటనే సీజ్‌ చర్యలు చేపట్టారు.

ప్రైవేటు ఆస్పత్రులకు నోటీసులు

పట్టణంలోని 30 ప్రైవేటు ఆస్పత్రులకు ప్రొఫెషనల్‌ టాక్స్‌ బకాయిల చెల్లింపులపై అధికారులు నోటీసులు జారీ చేశారు. ప్రతీ సంవత్సరం సుమారు రూ.2,500వరకు ప్రొఫెషనల్‌ టాక్స్‌ చెల్లించాల్సి ఉండగా, పలుచోట్ల బకాయిలు పేరుకుపోయినట్లు గుర్తించారు. నోటీసులు అందిన ఆస్పత్రులు నిర్దేశిత గడువులోపు బకాయిలను చెల్లించాలని సూచించారు. ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల వివరాలను కూడా పరిశీలించి, వాటికి సంబంధించిన బకాయిలపై నోటీసులు జారీ చేయనున్నట్లు కమర్షియల్‌ టాక్స్‌ అధికారి వీరబాబు తెలిపారు.

పట్టణంలో ఐదు అక్రమ సెల్లార్లు సీజ్‌

సెల్లార్ల దుర్వినియోగంపై మున్సిపల్‌ కమిషనర్‌ కఠిన చర్యలు

ఒక్కరోజే పలు శాఖల అధికారుల మెరుపు తనిఖీలు

నిబంధనలకు విరుద్ధంగా బ్యాంకులు, కళాశాల నిర్వహణ

కలెక్టర్‌ ఆదేశాలతో భవనం మూసివేత

పార్కింగ్‌ నిబంధనల ఉల్లంఘన,

అనుమతి లేని హాస్టళ్లు

తనిఖీల్లో బయటపడ్డ అక్రమాలు

కెనరా బ్యాంకు ప్రమాదం తర్వాత..

పట్టణంలోని బాలాజీనగర్‌ ఏరియా కెనరా బ్యాంకు శాఖలో చోటుచేసుకున్న అగ్నిప్రమాదం నేపథ్యంలో కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా ఆదేశాల మేరకు మున్సిపల్‌ కమిషనర్‌ రాజశేఖర్‌రెడ్డి నేతృత్వంలో ఎనిమిది శాఖల ఉన్నతాధికారులు బుధవారం భవనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. బాలాజీ నగర్‌లో నిమ్మ రామ్మోహన్‌రెడ్డికి సంబంధించిన భవనంలో అద్దెకు కొనసాగుతున్న కెనరా బ్యాంకుతో పాటు డీసీసీ బ్యాంకు, పై అంతస్తుల్లో అనుమతులు లేకుండా కళాశాల తరగతి గదులు, హాస్టళ్లు నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. తనిఖీలో భవన నిర్మాణం, వినియోగంలో పలు నిబంధనల ఉల్లంఘనలు వెలుగు చూశాయి. నివాస గృహ నిర్మాణానికి అనుమతి పొందిన భవనాన్ని వాణిజ్య అవసరాలకు వినియోగించడం, స్టిల్ట్‌ ఫ్లోర్‌ను పార్కింగ్‌కు బదులుగా ఇతర అవసరాలకు ఉపయోగించడం, తప్పనిసరిగా ఉండాల్సిన సెట్‌బ్యాక్‌లను పాటించకపోవడం వంటి లోపాలను అధికారులు గుర్తించారు. అలాగే భవనానికి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ లేకుండానే విద్యుత్‌ కనెక్షన్‌ పొందినట్లు, విద్యాశాఖ అనుమతులు లేకుండా కళాశాల తరగతులు, హాస్టళ్లు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ప్రజల ప్రాణాలు, ఆస్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని సంబంధిత భవనాన్ని పూర్తిగా సీజ్‌ చేసినట్లు కమిషనర్‌ రాజశేఖర్‌ రెడ్డి తెలిపారు. తనిఖీల్లో ఎన్పీడీసీఎల్‌ ఎస్‌ఈ సంపత్‌రెడ్డి, అగ్నిమాపక శాఖ అధికారి రేమండ్‌బాబు, విద్యాశాఖ అదనపు డైరెక్టర్‌ కార్యాలయ ప్రతినిధులు, పట్టణ ప్రణాళిక, పురపాలిక విభాగం అధికారులు పులి శేఖర్‌, కుమార్‌, పవన్‌, మున్సిపల్‌ సిబ్బంది పాల్గొన్నారు. ఇందులో ఉన్న రెండు బ్యాంకుల నిర్వహణకు సంబంధించి బ్యాంకింగ్‌ ఉన్నతాధికారులు నేడు కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝాను కలవనున్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement