కేయూ క్యాంపస్:
కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఈ విద్యాసంవత్సరం 2026–2027లో ప్రవేశాలకు విద్యార్థులు అనాసక్తి చూపుతున్నారు. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్, గురుకుల, అటానమస్ డిగ్రీ కళాశాలల్లో ప్రథమ సంవత్సరంలో ఇంకా 70శాతం సీట్లు ఖాళీగానే ఉన్నాయి. బీఏ, బీకాం, బీఎస్సీ, బీకాం కంప్యూటర్స్ తదితర కోర్సులతోపాటు ఈసారి కొన్ని కాలేజీల్లో కొత్త కోర్సులు ప్రవేశపెట్టారు. మూడు ఉమ్మడి జిల్లాల్లో మొత్తంగా 241 డిగ్రీ కళాశాలలుండగా ప్రథమ సంవత్సరంలో 1,00,600 సీట్లు ఉన్నాయి. ఆన్‌లైన్ దోస్త్ ద్వారా ఇప్పటికే మూడు దశల్లో ప్రవేశాలకు అవకాశం కల్పించారు. ఇప్పటివరకు 30,071సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. విద్యార్థులు ఎక్కువగా ఇంజనీరింగ్, ఇతర వృత్తి విద్యా కోర్సులవైపు ఆసక్తి చూపడం వల్లే సీట్లు భర్తీ కావడం లేదని భావిస్తున్నారు. ఇంజనీరింగ్ కోర్సుల్లో ఇంకా మొదటి దశలో ప్రవేశాలు కొనసాగుతున్నాయి. ఈ ప్రక్రియ పూర్తయితే సీట్లురాని వారు డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు పొందనున్నారు.
నాల్గవ దశ లేదా స్పెషల్ ఫేజ్‌పైనే ఆశలు..
కాలేజీల్లో ప్రవేశాలకు నాల్గవ దశ లేదా స్పెషల్ ఫేజ్‌గా మరోసారి రాష్ట్ర ఉన్నత విద్యామండలి అవకాశం కల్పించబోతుంది. ఈనెల 20నుంచి 25వ తేదీ మధ్య స్పెషల్ ఫేజ్ అడ్మిషన్ నోటిఫికేషన్ రానున్నట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. ఈ దశలో మిగతా సీట్లలో కొంతమేర భర్తీ అవుతాయనే ధీమాతో ప్రభుత్వ డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాళ్లు ఉన్నారు. ఈ విద్యాసంవత్సరంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలల అధ్యాపకులు అడ్మిషన్ల కోసం విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. పలు కొత్త కోర్సులను కూడా ప్రవేశపెట్టారు. దీంతో గతంకంటే కొన్ని కళాశాలల్లో సీట్లు పెరిగాయి. కానీ, కొన్ని ప్రైవేట్ కళాశాలల్లోనూ వివిధ కోర్సుల్లో ఆశించిన మేర సీట్లు భర్తీ కాకపోవడం ఆందోళన కలిగించే అంశంగా అధ్యాపకులు చెబుతున్నారు.
ఈసారి కొత్త కోర్సులు ఇలా..
ఈ విద్యాసంవత్సరంలో డిగ్రీ స్ధాయిలో ప్రభుత్వం ఉపాధి కల్పనకు కోర్సులను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అందులో అప్రెంటిస్‌షిప్ ఎంబెడెడ్ డిగ్రీ ప్రోగ్రాం కింద (ఏఈడీపీ), బీకాం బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ (బీఎఫ్‌ఎస్‌ఐ), బీఎస్సీ హార్టికల్చర్, హెల్త్‌కేర్ మేనేజ్‌మెంట్, డెయిరీ అండ్ పౌల్ట్రీ మేనేజ్‌మెంట్, బీబీఏ రిటైల్ ఆపరేషన్స్, బీఎస్సీ లైఫ్‌సైన్సెస్ ప్రధానంగా ఉన్నాయి. వీటిద్వారా పలు కళాశాలల్లో కొంత మేర అడ్మిషన్లు అయ్యాయి. మరికొన్నింటిల్లో అంతంత మాత్రమే భర్తీ అయ్యాయి.
కేయూ పరిధిలో లక్షకు పైగా సీట్లలో 30,071 మాత్రమే భర్తీ
మూడు విడతల ప్రవేశాలు పూర్తయినా ఇంకా 70 శాతం సీట్లు ఖాళీ
ఇంజనీరింగ్, ఇతర వృత్తి విద్యా కోర్సులవైపు విద్యార్థుల మొగ్గు
ప్రత్యేక లేదా నాలుగో విడత కౌన్సెలింగ్‌పైనే కళాశాలల ఆశలు


