● పురపాలిక సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించిన మున్సిపల్ కమిషనర్
జనగామ: ప్రతీ ఇల్లు, విద్యాసంస్థ, ప్రభుత్వ కార్యాలయం, వాణిజ్య సముదాయంలో తప్పనిసరిగా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ (ఇంకుడు గుంతలు) వ్యవస్థలను ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్‌రెడ్డి సూచించారు. పురపాలక సంఘం ఆధ్వర్యంలో బుధవారం ‘క్యాచ్ ది రైన్–వర్షపు నీటిని ఒడిసిపట్టండి’ అవగాహన కార్యక్రమాన్ని పురపాలక కార్యాలయ ఆవరణలో నిర్వహించారు. ఈ సందర్భంగా వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపు, ప్రతీ ఇంటిలో ఇంకుడు గుంతల ఏర్పాటు, వర్షపు నీటిని వృథా కాకుండా నిల్వ చేసుకోవాల్సిన అవసరంపై అధికారులు, ఉద్యోగులకు అవగాహన కల్పించారు. ‘ప్రతి నీటి బొట్టును సంరక్షిద్దాం, వర్షపు నీటిని ఒడిసిపట్టి భవిష్యత్ తరాలకు నీటి వనరులను కాపాడుదాం’ అంటూ అధికారులు, సిబ్బంది ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో పురపాలక, ఇంజినీరింగ్ విభాగం అధికారులు, శానిటేషన్ సిబ్బంది, ఇతర శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు.


