న్యూస్‌రీల్
జనగామ: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏబీవీ డిగ్రీ కళాశాల (అటానమస్) ఈ విద్యా సంవత్సరంలో రికార్డు స్థాయిలో అడ్మిషన్లతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందుతోంది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త కోర్సులు, మెరుగైన విద్యా ప్రమాణాలు, ఉపాధి అవకాశాలపై దృష్టి పెట్టడంతో విద్యార్థులు భారీ సంఖ్యలో కళాశాల వైపు మొగ్గుచూపుతున్నారు. ఈ ఏడాది నుంచి ప్రవేశపెట్టిన ఏఈడీపీ (అప్రెంటిషిప్ ఎంబెడెడ్ డిగ్రీ ప్రోగ్రాం) కింద ప్రారంభమైన బీకాం (బీఎఫ్‌ఎస్‌ఐ), బీఎస్సీ హెల్త్ కేర్ కోర్సులకు అనూహ్య స్పందన లభించింది.
అందుబాటులో కోర్సులు
ప్రస్తుతం బీఏ (ఇంగ్లిష్, తెలుగు మీడియం), బీకాం సీఏ, బీఎస్సీ లైఫ్ సైన్స్, బీఎస్సీ ఫిజికల్ సైన్స్, బీఎస్సీ హెల్త్ కేర్, బీఎఫ్‌ఎస్‌ఐ వంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఏఈడీపీ కింద ప్రారంభమైన బీఎఫ్‌ఎస్‌ఐ కోర్సు ద్వారా బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్ రంగాలకు అవసరమైన నైపుణ్యాలను, బీఎస్సీ హెల్త్ కేర్ ద్వారా ఆసుపత్రులు, డయాగ్నస్టిక్ కేంద్రాలు, ఆరోగ్య రంగానికి అవసరమైన శిక్షణను విద్యార్థులకు అందించేలా రూపొందించారు. బీఎఫ్‌ఎస్‌ఐ కోర్సుకు అధిక డిమాండ్ ఉండడంతో మరో 60 సీట్లు మంజూరు చేసేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉంది.
ఏఈడీపీలో రాష్ట్రంలో మొదటి స్థానం
రాష్ట్ర వ్యాప్తంగా 90 ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో మాత్రమే ఈ ఏఈడీపీ కోర్సులను అమలు చేస్తుండగా, అడ్మిషన్ల పరంగా ఏబీవీ డిగ్రీ కళాశాల రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ఇప్పటికే దోస్త్ మూడు దశల కౌన్సెలింగ్ పూర్తికాగా, స్లైడింగ్ ఆప్షన్లు కూడా ముగిశాయి.
పూర్వ వైభవం
ప్రస్తుతం ద్వితీయ సంవత్సరం చదువుతున్న పాత విద్యార్థులు 350 మంది ఉండగా, ఈ ఏడాది కొత్తగా ఇప్పటికే 487 మంది అడ్మిషన్లు పొందారు. దీంతో మొత్తం విద్యార్థుల సంఖ్య 837కు చేరుకుంది. స్పెషల్ ఫేజ్, స్పాట్ అడ్మిషన్ల అనంతరం మరో 150 నుంచి 200 మంది వరకు చేరే అవకాశముందని కళాశాల వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో విద్యార్థుల సంఖ్య 1000 మార్కును దాటే అవకాశం ఉందని భావిస్తున్నారు. జిల్లాతో పాటు మంచిర్యాల, ఖమ్మం తదితర జిల్లాల నుంచి కూడా విద్యార్థులు ఈ కళాశాలను ఎంపిక చేసుకోవడం గమనార్హం.
అధ్యాపకులను పెంచాల్సిందే
విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో అధ్యాపకుల కొరత సవాలే. కళాశాలకు 30 రెగ్యులర్ పోస్టులు మంజూరై ఉండగా ప్రస్తుతం కేవలం 9 మంది రెగ్యులర్ అధ్యాపకులు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. వీరితో పాటు ఇద్దరు కాంట్రాక్ట్, 11 మంది గెస్ట్ లెక్చరర్లు కలిపి మొత్తం 22 మంది బోధన అందిస్తున్నారు. మరో 7 నుంచి 8 మంది అధ్యాపకులు అవసరమని కళాశాల వర్గాలు పేర్కొంటున్నాయి.
విద్యార్థుల నుంచి విశేష ఆదరణ
ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉపాధి ఆధారిత కొత్త కోర్సులకు విద్యార్థులు విశేష ఆదరణ చూపుతున్నారు. దూరప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు ఎస్సీ, బీసీ తదితర ప్రభుత్వ వసతి గృహాల్లో సీట్లు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నాం.
– డాక్టర్ కె.శ్రీనివాస్, ప్రిన్సిపాల్, డిగ్రీ కళాశాల
58
బీఎస్సీహెల్త్ కేర్
అందుబాటులో ఉన్న కోర్సులు:
బీఏ(తెలుగు/ఇంగ్లిష్ మీడియం)
బీకాం(సీఏ)
బీకాం(బీఎఫ్‌ఎస్‌ఐ)
బీఎస్సీ లైఫ్ సైన్స్
బీఎస్సీ ఫిజికల్ సైన్స్
బీఎస్సీ హెల్త్ కేర్
మొత్తంసీట్లు అడ్మిషన్లు
భర్తీ శాతం
60
55
కొత్త కోర్సులకు విద్యార్థుల నుంచి ఫుల్ డిమాండ్
ఏఈడీపీలో రికార్డు స్థాయిలో అడ్మిషన్లు
సీట్ల భర్తీలో రాష్ట్రంలోనే తొలి స్థానం
ఇతర జిల్లాల నుంచి సైతం చేరుతున్న విద్యార్థులు


