ఈఫొటోలో కనిపిస్తున్న దివ్యాంగ బాలుడి పేరు ఎండీ జాఫర్. చిల్పూర్ మండలం పల్లగుట్ట గ్రామం. గ్రామానికి చెందిన ఎండీ జామీరుద్దీన్, యాకూబీ దంపతులకు ఒక కుమారుడు, కుమార్తె. బాబు జాఫర్ పుట్టకతోనే రెండు చేతులు కాళ్లు సరిగా లేక స్పైనల్ సమస్యతో పుట్టాడు. నాటి నుంచి తల్లిదండ్రులు ఆస్పత్రుల చుట్టూ తిరిగి రూ.6 లక్షలకు పైగా ఖర్చు చేశాడు. తండ్రి కూలి పనితో జీవనం కొనసాగిస్తున్నా, వారికి ఎలాంటి ఆధారం లేదు. నెలకు రూ.4 వేల వరకు మందులకు, ఇతర అవసరాలకు ఖర్చు చేయాల్సి వస్తోంది. కనీసం దివ్యాంగ పెన్షన్ అయిన వస్తే మందులకు అవుతాయని సదరం సర్టిఫికెట్ ఇచ్చి పింఛన్ మంజూరు చేయాలని తల్లిదండ్రులు వేడుకున్నారు.
జనగామ రూరల్: ప్రజలకు తమ సమస్యలను పరిష్కరిస్తారనే నమ్మకాన్ని ప్రతీ శాఖ అధికారులు కలిగించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన గ్రీవెన్స్‌సెల్‌లో అదనపు కలెక్టర్ బెన్‌షాలోమ్‌తో కలిసి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన ప్రజల నుంచి 335 అర్జీలు స్వీకరించారు. కార్యక్రమంలో డీఆర్డీఓ భాస్కర్, గృహ నిర్మాణ శాఖ పీడీ మాతృనాయక్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
దరఖాస్తుల్లో కొన్ని ఇలా..
● లింగాల ఘణపురం మండలం వేలేరు గ్రామానికి చెందిన పల్లా వెంకటలక్ష్మి, తన తల్లిదండ్రులు పసుపు కుంకుమ కింద ఇచ్చిన భూమిని తన అన్నదమ్ములు తెలియకుండా వారి పేరు మీద పట్టా చేసుకున్నారని, విచారణ చేపట్టి ఆ భూమిని తన పేరు మీదకు పట్టా చేయాలని వినతి అందజేశారు.
● స్టేషన్ ఘన్‌పూర్ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ఫిజికల్ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుడు డిప్యుటేషన్‌లో జనగామ మండలం పసరమడ్ల బాలుర ఆశ్రమ పాఠశాల ఇన్‌చార్జ్ ప్రధానోపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారు. మూడేళ్లుగా అక్కడే ఉండి అధికారుల అండదండలతో స్థానచలనం లేకుండా ఉంటున్నారని, డిప్యుటేషన్ రద్దు చేసి పీడీగా పంపించాలని స్టేషన్ ఘన్‌పూర్ మండలానికి చెందిన లకావత్ చిరంజీవి వినతిపత్రం అందించారు.
● బచ్చన్నపేట మండలం అలింపూర్ గ్రామానికి చెందిన పాకాల నాగయ్య పోచన్నపేట గ్రామంలో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్‌గా విధులు నిర్వహిస్తున్నాడని, కొన్ని నెలల క్రితం బచ్చన్నపేట ఎస్‌పీఎం కొత్తపల్లి రాజేశ్ అనే వ్యక్తికి పెన్షన్ డబ్బులు రూ.5లక్షలు ఇచ్చి పంపిస్తున్నామని చెప్పి, డబ్బులు ఇవ్వకుండా మోసం చేస్తున్నాడని అలింపూర్‌కు చెందిన పాకాల ప్రమీల అర్జీ అందించారు. పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో తన భర్త నాగయ్య అనారోగ్యానికి గురయ్యాడని కలెక్టర్‌తో వాపోయింది. విచారణ చేపట్టి పోస్టల్ అధికారి డబ్బులతో పరారైన వ్యక్తిపై చర్యలు తీసుకోని డబ్బులు ఇప్పించాలని వేడుకుంది.
● పట్టణంలోని 15 వార్డు జూనియర్ కళాశాల పరిసర ప్రాంతంలో బెల్ట్ షాపు నిర్వహిస్తున్నారని, రాత్రి వేళల్లో మహిళలు, పిల్లలు బయటికి వెళ్లలేకపోతున్నారని దిగోజు సాంబయ్యచారి వినతి అందజేశారు. తక్షణం బెల్ట్ షాపును ఎత్తివేయాలని కోరారు.
వేగంగా ప్రజల సమస్యలు పరిష్కరించాలి
కలెక్టరేట్ గ్రీవెన్స్‌లో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా


